డిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం

August 01, 2019


img

డిల్లీ అసెంబ్లీకి 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగనున్నాయి. కనుక సిఎం అరవింద్ కేజ్రీవాల్ అపుడే వాటి కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. డిల్లీ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నాలలో భాగంగా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ ఈరోజు సంచలన ప్రకటన చేశారు. నేటి నుంచే నెలకు 200 యూనిట్లు వరకు పూర్తి ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. నెలకు 201-400  యూనిట్ల ఛార్జీలపై 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. ఇప్పటివరకు నెలకు 250 యూనిట్లు వాడుకునేవారు రూ.800 చొప్పున చెల్లించేవారు కానీ ఇకపై కేవలం రూ.252 చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా 300 యూనిట్లకు గతంలో రూ.971 ఇకపై రూ.526, అదేవిధంగా 400 యూనిట్లకు గతంలో రూ.1,320 ఇకపై నెలకు రూ.1,075 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. 

ఎన్నికలలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఇటువంటి హామీలు ఇస్తుండటం సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఆ హామీలతో ఏదైనా పార్టీ అధికారం చేజిక్కించుకోగలిగితే వెంటనే దేశంలో ఇతర పార్టీలు కూడా వాటిని తమ జాబితాలో చేర్చుకోవడం పరిపాటిగా మారిందిపుడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పంటరుణాల మాఫీ హామీని ఇచ్చినప్పుడు దాని వలన ఆర్ధికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని వాదించిన కేంద్రప్రభుత్వం, యూపీ అసెంబ్లీ ఎన్నికలలో అదే హామీని ఇచ్చి అధికారం చేజిక్కించుకొంది. కనుక డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన ఈ విద్యుత్ సబ్సీడీ హామీతో ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలలోని పార్టీలు ఆ హామీని తమ జాబితాలో చేర్చుకున్నా ఆశ్చర్యం లేదు. రాజకీయ పార్టీలిస్తున్న ఇటువంటి హామీలను చూస్తుంటే భవిష్యత్తులో ఎవరూ ఏ పని చేయనవసరం లేదు కేవలం ఓటేస్తే చాలు కూర్చోబెట్టి ప్రభుత్వాలే పోషిస్తాయనిపిస్తోంది.


Related Post