తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించి ఉంటే...

July 30, 2019


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, దానిని రూపొందించిన సిఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ ప్రతిపక్షాల సూచనలను, సలహాలను ఏమాత్రం పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ రూపొందించడం వలన రాష్ట్రంపై సుమారు రూ.40,000 కోట్లకు పైగా ఆర్ధికభారం పడబోతోంది. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మించి ఉండి ఉంటే సుందిళ్ళకు గ్రావిటీ పద్దతిలోనే సులువుగా నీరు పారేది. దాని వలన రాష్ట్రంపై ఆర్ధికభారం చాలా తగ్గి ఉండేది. కానీ సిఎం కేసీఆర్‌ మేడిగడ్డ, అన్నారం వద్ద ఎత్తిపోతలను పెట్టడంతో సుమారు 15 రోజుల సమయం వృధా అవుతుండటమే కాకుండా వాటి వలన రాష్ట్రంపై చాలా ఆర్ధికభారం పడనుంది. సిఎం కేసీఆర్‌ మొండిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వలననే ఇదంతా జరుగుతోంది. కనుక రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇప్పటికైనా తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను. లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు చివరికి ఒక పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణం వలన కలిగే లాభనష్టాలపై నిపుణులతో చర్చించేందుకు నేను సిద్దంగా ఉన్నాను. అవసరమైతే నేనే స్వయంగా మీడియా మిత్రులను వెంటబెట్టుకొని తమ్మిడిహట్టి వద్దకు తీసుకువెళ్ళి వారికి వాస్తవ పరిస్థితి వివరిస్తాను,” అని జీవన్ రెడ్డి అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన భారీ పెట్టుబడి, దాని నిర్వహణ వ్యయం, భారీ విద్యుత్ వినియోగం కారణంగా ప్రభుత్వంపై పడే ఆర్ధికభారం వంటి అనేక ప్రతికూలాంశాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. అయితే ప్రపంచంలో ప్రతీ ప్రాంతానికి ఒక్కో రకమైన సహజవనరులు, భౌగోళిక పరిస్థితులు, ఒక్కో రకమైన సమస్యలు, అవసరాలు ఉంటాయని తదనుగుణంగానే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొంటాయని సిఎం కేసీఆర్‌ వాదన. 

తెలంగాణ రాష్ట్రంలో గ్రావిటీ పద్దతిలో నీరు పారే అవకాశం లేనందున తప్పనిసరిగా ఎత్తిపోతల ద్వారానే అవసరమైన చోటికి నీటిని తరలించవలసి ఉంటుందని, దానికోసం కొంత అధనపు భారాన్ని భరించకతప్పదని సిఎం కేసీఆర్‌ వాదన. రాష్ట్రానికి, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి దీని వలన కలిగే మేలును చూడాలే తప్ప ఆర్ధికభారమని వితండవాదం చేయడం సరికాదని సిఎం కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. పరస్పర భిన్నమైన ఈ రెండు వాదనలలో ఏది సరైనదో కాలమే చెపుతుంది. 


Related Post