తెలంగాణలో తీవ్ర కలకలానికి తెర తీసిన ఎంసెట్ 2 పరీక్షాపత్రం ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమైంది. తెలంగాణ సర్కార్ కు మాయనివచ్చను తెచ్చిన ఈ ఎంసెట్ స్కాంపై ప్రభుత్వం ఇప్పటికే ఎంక్వైరీ వేసింది. సిఐడీ కూడా దీన్ని విచారించి లీకేజీ వాస్తవమే అని తేల్చడంతో ప్రతిపక్షాలకు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపొసేందుకు అవకాశం లభించింది. ఎంసెట్ పరీక్షపత్రం లీక్ తో మరోసారి పరీక్షను నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది అనే వాదన వినిపిస్తోంది.
గతంలో డాక్టర్ రాజయ్య డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన శాఖలో జరిగిన అవినీతి కారణంగా ఆయన్ను మంత్రి మండలి నుండి తీసేశారు కేసీఆర్. అప్పుడు కేసీఆర్ నిజంగా గ్రేట్ అని చాలా మంది అనుకున్నారు. మరి ఇప్పుడు కూడా కేసీఆర్ అలాంటి నిర్ణయమే తీసుకుంటారా.? కడియం శ్రీహరిని మంత్రి మండలి నుండి తప్పిస్తారా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఎంసెట్ పరీక్ష లీకేజ్ వ్యవహారంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నోరుమెదపలేదు. ఇప్పటికే ఏపిలో ఓ మంత్రి తెలంగాణలో ఎంసెట్ పరీక్ష నిర్వహణ మీద జోకులు కూడా వేశారు. ’మన విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. తెలంగాణ మాదిరి కాదు మాది పక్కా ప్లానింగ్ తో ఉంటుంది.. లీకేజ్ కు అవకాశం లేదు’ అని. ‘‘ముందు నుండి కూడా ప్రత్యేక ఎంసెట్ పరీక్షకు పట్టుబట్టిన తెలంగాణ ఎంసెట్ పరీక్షను ఏ రేంజ్ లో నిర్వహించిందో ’’అని కామెడీ చేస్తున్నారు.
వేల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఎంసెట్ వ్యవహారంలో లీకేజ్, భారీ స్కాం జరిగింది అని క్లారిటీ వచ్చింది. కేసీఆర్ సర్కార్ ఎంసెట్ ను నిర్వహించాలా..? లేదంటే వేరే మార్గం చూడాలా అనే దానిపై పరిశోధన చేస్తోంది. కానీ అసలు ఎక్కడ లోపం జరిగింది. ఎవరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అన్న దానిపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చెయ్యడం లేదు. ఇప్పటికే చాలా మంది కడియం శ్రీహరిని కేబినెట్ నుండి బయటకు పంపించే గడియలు దగ్గరపడ్డాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి నిజంగా కడియం తన మంత్రి పదవిని కోల్పోతారో లేదో అని.