మరికొంత కాలం బిజెపి అధ్యక్షుడిగా అమిత్ షా?

June 14, 2019


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో సీనియర్ బిజెపి నేత, మాజీ కేంద్రమంత్రి జెపి నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ ఏడాది డిసెంబర్ నెలలో మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున అవి ముగిసేవరకు అమిత్ షా బిజెపి జాతీయ అధ్యక్షుడుగా కొనసాగాలని నిర్ణయించినట్లు తాజా సమాచారం. అమిత్ షా కొనసాగడానికి బలమైన కారణమే కనిపిస్తోంది. 

ఈసారి దేశవ్యాప్తంగా మోడీ సర్కారుకు ఒకపక్క ఎదురుగాలులు వీస్తుంటే, మరోపక్క గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలో ప్రతిపక్షపార్టీలన్నీ కలిసికట్టుగా నిలవడంతో లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. అయినప్పటికీ అమిత్ షా నేతృత్వంలో బిజెపి ఘనవిజయం సాధించి భారీ మెజార్టీతో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కనుక ఆయన నేతృత్వంలోనే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడం మంచిదనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

ఆ ఎన్నికలు పూర్తికాగానే వచ్చే ఏడాది ఆరంభంలో బిజెపి సంస్థాగత ఎన్నికలు జరుగనున్నాయి. కనుక అప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం మంచిదని బిజెపి భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజులలో స్పష్టత రావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో జూలై 6వ తేదీ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. 


Related Post