మా తదుపరి లక్ష్యం తెలంగాణయే: లక్ష్మణ్

June 13, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయంతో రాష్ట్రంలో బిజెపి పనైపోయిందనుకుంటే, ఆ వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకొని తెరాస, కాంగ్రెస్‌లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో విలీనమైపోవడం, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జాతీయరాజకీయాలలో పాల్గొనాలనుకోవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ అకస్మాత్తుగా చాలా బలహీనంగా కనబడుతోంది. ఈ పరిణామాలు రాష్ట్ర బిజెపి నేతలలో ఆత్మవిశ్వాసం, కొత్త ఉత్సాహం కలిగిస్తున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మాటలలో అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

ఈరోజు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను చూసి సిఎం కేసీఆర్‌ తీవ్ర అభద్రతాభావానికి లోనవుతున్నారు. అందుకే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకొంటున్నారు. మా పార్టీ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మా పార్టీ పుంజుకోవడమే ఇందుకు తాజా నిదర్శనం. అందుకే రాష్ట్రంలో అనేకమంది ఇతర పార్టీల నేతలు మా పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. మా పార్టీ తదుపరి లక్ష్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే. ఇకపై కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాము. కారు సారు డిల్లీ సర్కారు అంటూ కేంద్రంలో చక్రం తిప్పాలని కలలుగన్న సిఎం కేసీఆర్‌ తన కుమార్తె కవితను, కుడిభుజం వంటి వినోద్ ను గెలిపించుకోలేకపోయాయారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెరాసల పట్ల ప్రజలలో విముఖత క్రమంగా పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలలో ఏడుగురు తెరాస అభ్యర్ధుల ఓటమి ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కనుక తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా బిజెపి నిలిచింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బిజెపి పుంజుకోబోతోందని స్పష్టమైంది. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా మా సత్తా చాటుకొని తెలంగాణలో విజృంభిస్తాము,” అని కె.లక్ష్మణ్ అన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన మాట వాస్తవమే కానీ అంతమాత్రన్న తెరాసకు ప్రత్యామ్నాయంగా బిజెపి ఎదగగలదా? తెలంగాణపై తెరాస పట్టుని, తెరాస అధికారాన్ని బిజెపి సవాలు చేయడానికి ప్రయత్నిస్తే తెరాస చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోంటుందా? అంటే కాదనే అర్ధమవుతుంది. కనుక గతంలో తెరాస-కాంగ్రెస్‌ మద్య ఎటువంటి ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేదో ఇప్పుడు తెరాస-బిజెపిల మద్య అటువంటి పరిస్థితులే ఏర్పడవచ్చు.


Related Post