దేవుడి స్క్రిప్ట్ చాలా గొప్పది: జగన్

June 13, 2019


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, టిడిపిని ఉద్దేశ్యించి ఈరోజు శాసనసభలో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఎన్నిక అనంతరం జగన్‌ శాసనసభలో మాట్లాడుతూ, “ఇదే సభలో గత ప్రభుత్వం విలువలను, సభా సాంప్రదాయాలను మంట గలిపింది. కానీ మేము కూడా అదే విధంగా వ్యవహరిస్తే మాకు వారికీ తేడా ఏముంటుంది? అందుకే సభమర్యాద పాటించి ప్రతిపక్షసభ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాము. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలను మనవైపు తిప్పుకొంటే టిడిపికి ప్రధాన ప్రతిపక్షహోదా కోల్పోతుందని కొందరు నాకు సలహా ఇచ్చారు. కానీ మనం కూడా టిడిపి చేసిన తప్పులనే చేయడం సరికాదని చెప్పాను. ఒకవేళ టిడిపి ఎమ్మెల్యేలు ఎవరైనా మా పార్టీలో చేరాలనుకుంటే ముందుగా వారి చేత వారి ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయించే చేర్చుకొంటాము. గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ముగ్గురు ఎంపీలను టిడిపిలోకి ఫిరాయింపజేసుకున్నారు. కానీ ఈసారి టిడిపికి సరిగ్గా అన్ని అసెంబ్లీ, ఎంపీ సీట్లే రావడం చూస్తే  దేవుడి స్క్రిప్ట్ చాలా ఎంత గొప్పదో అర్ధం అవుతుంది. ఈ సభను చూస్తే ‘బ్యూటీ ఆఫ్ డెమొక్రెసీ... బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్’ ఏవిధంగా ఉంటుందో అర్ధమవుతుంది. గత ప్రభుత్వం మాపట్ల ఏవిధంగా వ్యవహరించినప్పటికీ మేము మాత్రం దేశానికే ఆదర్శంగా ఉండేవిధంగా సభను నడిపిస్తాము,” అని అన్నారు. 

జగన్‌కు చంద్రబాబునాయుడు ధీటుగా జవాబిస్తూ, “అధికారం, ప్రతిపక్షం రెండూ మాకు కొత్తకాదు. ప్రతిపక్ష బెంచీలలో కూర్చోన్నంత మాత్రన్న నా వాయిస్ ఏమీ తగ్గదు. యధాప్రకారం ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూనే ఉంటాను,” అని అన్నారు. 


Related Post