త్వరలో ఇద్దరు టి-కాంగ్రెస్‌ ఎంపీలు జంప్?

June 13, 2019


img

పన్నెండు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపుతో ఇప్పటికే డీలాపడిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎంపీలు మరో షాక్ ఇవ్వబోతున్నట్లు తాజా సమాచారం. రెండు రోజుల క్రితం ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు రహస్యంగా డిల్లీ వెళ్ళి బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ను కలిసినట్లు సమాచారం. అయితే వారిరువురు ఎవరనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. 

ఈ వార్తలపై మొట్టమొదటిగా స్పందించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి “బిజెపిలో చేరబోతున్నవారెవరో నాకు తెలియదు కానీ నేను మాత్రం బిజెపిలో చేరడంలేదు,” అని ప్రకటించారు. 

 ఒకవేళ కోమటిరెడ్డికి పార్టీ మారే ఉద్దేశ్యం లేకపోవడం నిజమైతే, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్గొండ),  రేవంత్‌ రెడ్డి (మల్కాజ్‌గిరి) మాత్రమే మిగిలారు. వారిలో రేవంత్‌ రెడ్డి పార్టీ మారినా ఆశ్చర్యం లేదు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మారితే నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అవుతుంది. కానీ ఆయన పిసిసి అధ్యక్షుడుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తునందున పార్టీ మారకపోవచ్చు. కనుక మిగిలిన ఇద్దరిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఒకవేళ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బిజెపిలో చేరితే ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేరు కనుక ఆయన కూడా పార్టీని వీడవచ్చు. ఒకవేళ ఇదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇక కోలుకోవడం కష్టమే. ఈ నెల 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవబోతున్నాయి కనుక ఆలోపుగానే ఈ వార్తలో నిజానిజాలు త్వరలోనే తేలిపోవచ్చు.


Related Post