దళితకార్డు ప్రయోగిస్తున్న టి-కాంగ్రెస్‌

June 10, 2019


img

పన్నెండు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవడంపై కాంగ్రెస్‌, తెరాసల మద్య మాటల యుద్ధం నడుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసుకొన్నప్పుడు తప్పు కానిది ఇప్పుడు తెరాస చేస్తే తప్పెలా అవుతుందని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. 

ఒక దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండటం, సిఎం కేసీఆర్‌ను సభలో ప్రశ్నించడం సహించలేకే 12 మందిని విలీనం చేసుకొన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 

అయితే రాష్ట్రంలో ప్రతిపక్షాలను బలహీనపరచడం ద్వారా తెరాసను మరింత బలోపేతం చేసుకొనే ఉద్దేశ్యంతోనే తెరాస ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోంది తప్ప దళితుడికి ప్రతిపక్షనేత హోదా దక్కకూడదనే ఉద్దేశ్యంతో కాదని అందరికీ తెలుసు. కనుక ఈ వ్యవహారానికి కాంగ్రెస్ పార్టీ కులంరంగు పూసే ప్రయత్నం చేస్తోందని స్పష్టం అవుతోంది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా నిలద్రొక్కుకొని పూర్వవైభవం సాధించాలని ఆలోచించాల్సిన కాంగ్రెస్‌ నేతలు, తమకు అలవాటైన మూస పద్దతిలో రాజకీయాలు చేస్తుండటం వలన ప్రయోజనం ఉండదని చెప్పక తప్పదు.      

జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు రావాలని అందుకు తాను గట్టిగా ప్రయత్నిస్తానని పదేపదే చెప్పిన సిఎం కేసీఆర్‌, రాష్ట్ర స్థాయిలో ఇటువంటి అనైతిక, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటాన్ని ప్రజాస్వామ్యవాదులు విమర్శిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్‌ చేసిన తప్పును తెరాస మళ్ళీ ఎందుకు చేస్తోందని, ఒక తప్పును వరుసగా చేస్తే అది ఒప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అలాగే...రేవంత్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెరాస ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకొన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పుగా అనిపించనప్పుడు, అదే తప్పు తెరాస చేస్తే ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయపార్టీలు తాత్కాలిక లేదా శాస్విత రాజకీయ ప్రయోజనాల కోసం నైతికవిలువలను వదులుకొంటే చివరికి ఏమవుతుందో ఈ అవాంఛనీయ పరిణామాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయని విశ్లేషకులు చెపుతున్నారు.


Related Post