పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేసుకొన్న జగన్

June 08, 2019


img

గత నెల 30న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకొంటూ అందరినీ ఆకట్టుకొంటున్నారు. ఈరోజు ఉదయం తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో అమరావతిలోని సచివాలయంలో ప్రవేశించి మూడు ఫైళ్ళపై సంతకాలు చేశారు. వాటిలో ఒకటి ఆశా వర్కర్ల జీతాలు రూ.3,000 నుంచి రూ.10,000 పెంచడానికి సంబందించినది. అనంతరం సచివాలయ ఉద్యోగులతో భేటీ అయినప్పుడు వారికి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించడంతో వారు జగన్‌కు జేజేలు పలికారు.   

ఆ తరువాత ఈరోజు ఉదయం 25 మంది మంత్రులతో ఎవరూ వేలెత్తి చూపలేనివిధంగా పూర్తిస్థాయి మంత్రివర్గం కూడా ఏర్పాటు చేసుకున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ వారందరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రంలో అన్ని కులాలకు, మహిళలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ ఏర్పాటుచేసుకున్నారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజికవర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఒక్కో కులానికి చెందిన ఒక వ్యక్తిని ఉపముఖ్యమంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. 25మందితో కూడిన జగన్ మంత్రివర్గంలో 14 పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించడం విశేషం. వాటిలో బీసీలకు-7, బీసీ(ఈ) మైనార్టీ-1, ఎస్సీలకు-5, రెడ్డి-4, కాపు-4, ఎస్టీ-1, క్షత్రియ-1, వైశ్య-1 చొప్పున మంత్రిపదవులు కేటాయించారు. ముగ్గురు మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించారు.    

స్పీకరుగా శ్రీకాకుళం జిల్లా, అమదాలవలస ఎమ్మెల్యే, తమ్మినేని సీతారాం (బీసీ), డెప్యూటీ స్పీకరుగా కోన రఘుపతి (బ్రాహ్మణ)లకు అవకాశం కల్పించారు. 

అలాగే ప్రభుత్వ చీఫ్‌ విప్‌, మరో ఐదుగురు విప్‌ల పేర్లను కూడా ఖరారు చేశారు. రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిని  ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా నియమించారు. 

ఈరోజు ఉదయం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారు: బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణ ప్రసాద్, అవంతి శ్రీనివాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ), కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేశ్, కలత్తూరు నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరాం, అంజాద్ బాషా, మాలగుండ్ల శంకర్ నారాయణ, పాముల పుష్పవాణి, , తానేటి వనిత, మేకతోటి సుచరిత.


Related Post