మోడీని గెలిపించిన వాడే బిజెపిని ఓడిస్తాడా?

June 07, 2019


img

ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ 2014 సార్వత్రిక ఎన్నికలలో నరేంద్రమోడీ విజయానికి తోడ్పడటంతో దేశమంతటా ఆయన పేరు మారుమోగిపోయింది. అప్పటి నుంచి ఆయనకు చాలా డిమాండ్ ఏర్పడింది. ఆ తరువాత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కాంగ్రెస్ పార్టీకి, ఇటీవల ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సేవలందించారు. ఏపీలో వైసీపీ విజయంతో ఆయనకు మరింత మంచి పేరు వచ్చింది. దాంతోపాతే ఆయనకు డిమాండ్ పెరిగింది. 

ఆయన ఏపీలో తన పని ముగించుకోగానే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయనతో మొన్న కోల్‌కతాలో సమావేశమయ్యారు. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించవలసిందిగా ఆమె కోరారు. అందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకరించారు. 

2016 ఏప్రిల్ నెలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కనుక మళ్ళీ 2021లో జరుగనున్నాయి. అంటే ఇంకా మరో రెండేళ్ళు సమయం ఉంది కనుక ఇప్పుడే తొందరపడవలసిన అవసరం లేదు. కానీ ఇంతవరకు పశ్చిమబెంగాల్లో తిరుగులేకుండా పాలిస్తున్న మమతా బెనర్జీకి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 18 స్థానాలు గెలుచుకొని పెద్ద షాక్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోగా రాష్ట్రంలో బలపడి అధికారం చేజిక్కించుకొంటామని గట్టిగా చెపుతోంది. ఈ నేపధ్యంలో మమతా బెనర్జీ కూడా ముందు జాగ్రత్త పడుతూ ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. అంటే 2014 ఎన్నికలలో నరేంద్రమోడీని గెలిపించిన ప్రశాంత్ కిషోర్, 2021 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని ఓడించడానికి సిద్దపడుతునారన్నమాట!


Related Post