జగన్ క్యాబినెట్‌ ఎలా ఉందంటే...

June 07, 2019


img

ఈరోజు తాడేపల్లిలో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దానిలో తన మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పిస్తున్నారో చెప్పలేదు కానీ మంత్రివర్గం ఏవిధంగా ఉండబోతోందో వివరించారు. మంత్రివర్గంలో మొత్తం 20 మంది మంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని ప్రకటించారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. 

పార్టీలో అందరూ కలిసికట్టుగా అనేక ఏళ్ళపాటు శ్రమించి వైసీపీని అధికారంలోకి తెచ్చినందున, మంత్రిపదవులు దక్కనివారు అసంతృప్తి చెందకుండా జగన్‌మోహన్‌రెడ్డి ఒక సరికొత్త ఫార్ములాను ప్రకటించారు. సరిగ్గా రెండున్నరేళ్ళ తరువాత మంత్రివర్గంలో 90 శాతం మందిని మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పారు. కనుక రేపు మంత్రివర్గంలో చోటు లభించని వారెవరూ నిరాశ చెందవద్దని జగన్ సూచించారు. 

అమరావతిలో సచివాలయం పక్కన మైదానంలో రేపు ఉదయం 11.49 గంటలకు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. గవర్నర్‌ నరసింహన్‌ వారిచేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. 

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  గౌతంరెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, సుచరిత, కొలుసు పార్థసారధి రేపు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.


Related Post