ప్రధాన ప్రతిపక్షహోదా కోల్పోయిన కాంగ్రెస్‌

June 07, 2019


img

గురువారం 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షహోదా కోల్పోయింది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచినందున తన హుజూర్‌నగర్‌ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయగానే తెరాస చురుకుగా పావులు కదిపి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

కాంగ్రెస్ పార్టీకి మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 12 మంది తెరాసలో చేరిపోవడంతో కాంగ్రెస్‌ బలం 7కు పడిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. శాసనసభలో మజ్లీస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్‌ కంటే మజ్లీస్ పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఆ పార్టీకి  అప్రయత్నంగానే శాసనసభలో ప్రధానప్రతిపక్ష హోదా దక్కింది. 

ఇక్కడ శాసనసభలోనే కాకుండా లోక్‌సభలో కూడా కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షహోదా కోల్పోబోతోంది. ప్రధాన ప్రతిపక్షహోదా పొందాలంటే కనీసం 55 మంది ఎంపీలు అవసరంగా కాగా కాంగ్రెస్ పార్టీ వద్ద 52 మంది మాత్రమే ఉన్నారు. దశాబ్ధాలుగా దేశాన్ని రాష్ట్రాలను ఎదురులేకుండా పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి దుస్థితి వస్తుందని బహుశః ఎవరూ ఊహించి ఉండరు. ఈ పరిస్థితుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా తెరుకొంటుందా లేక ఒకపక్క బిజెపి, మరోపక్క ప్రాంతీయ పార్టీల మద్య నలిగి క్రమంగా అదృశ్యమైపోతుందా కాలమే చెపుతుంది.


Related Post