అయితే సబితకు మంత్రి పదవి ఖాయమేనా?

June 07, 2019


img

గత ప్రభుత్వంలోనూ, ఇప్పటి కేసీఆర్‌ ప్రభుత్వంలోను మహిళలకు స్థానం కల్పించకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంతో తదుపరి మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తానని సిఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆ ఇద్దరిలో ఒకరు కవిత లేదా పద్మా దేవేందర్ రెడ్డి అనుకొంటే మరొకరు ఎవరని ఆలోచిస్తే సబితా ఇంద్రారెడ్డి పేరు చెప్పుకోవాలేమో? 

ఆమె కాంగ్రెస్‌ను వీడుతున్నప్పుడు మంత్రి పదవి హామీతోనే తెరాసలో చేరేందుకు ఒప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె కానీ తెరాస గానీ ఖండించలేదు. అంటే అవి నిజమనుకోవచ్చు. గురువారం ఆమెతో సహా 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో అధికారికంగా విలీనమైయ్యారు కనుక ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి ఇచ్చేందుకు ఎటువంటి అభ్యంతరమూ ఉండబోదు. కానీ ఆ రెండు మహిళా మంత్రుల స్థానాల కోసం ఇంతకాలం ఆశగా ఎదురుచూస్తున్న తెరాస మహిళా ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ చెందక తప్పదు. 

తదుపరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినప్పటికీ కొత్తగా ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంది. వాటిలో రెండు పదవులు మహిళలకు పోగా ఇంకా నాలుగు మంత్రిపదవులు మాత్రమే ఉంటాయి. వాటిలో కేటీఆర్‌, హరీష్‌రావులకు రెండు కేటాయిస్తే ఇంకా రెండు పదవులు మాత్రమే ఉంటాయి. 

ప్రస్తుతం ఉన్నవారిలో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను తొలగించి వారి స్థానంలో వేరేవారికి అవకాశం కల్పించవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజం కాకుంటే రెండు మంత్రి పదవులకు తెరాసలో చాలా పోటీ ఏర్పడుతుంది. 

తెరాసలో విలీనం అయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో గండ్ర వెంకటరమణారెడ్డి, చిరుమర్తి లింగయ్య, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఆత్రం సక్కు, సుధీర్‌రెడ్డి, పైలట్‌రోహిత్‌రెడ్డి, కందాల ఉపేందర్‌రెడ్డి ఉన్నారు. ఒకవేళ వారు కూడా ఆ పదవులకు పోటీ పడితే తెరాసలో ఎప్పటి నుంచో మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నవారికి నిరాశ, నిస్పృహలు, అసంతృప్తి తప్పవు. కనుక ఈసారి మంత్రివర్గ విస్తరణ సిఎం కేసీఆర్‌కు కత్తిమీద సావంటిదేనని చెప్పక తప్పదు.


Related Post