తెరాసకు ప్రత్యామ్నాయమనుకొన్న కాంగ్రెస్‌....విలీనం?

June 06, 2019


img

తెరాసలో కాంగ్రెస్‌ శాసనభాపక్షం విలీనానికి రంగం సిద్దం అవుతోంది. కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరిన ఎమ్మెల్యేలకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో విందుభోజనం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ శాసనభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయడంపై వారితో చర్చించడానికే విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వారు నేరుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి కాంగ్రెస్‌ శాసనభాపక్షాన్ని తెరాసలో విలీనం చేయవలసిందిగా లేఖ ఇవ్వనున్నట్లు సమాచారం. 

తాండూర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా తెరాసలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. మూడు రోజుల క్రితం కేటీఆర్‌ను కలిసిన ఆయన మళ్ళీ ఇవాళ్ళ మరోమారు కలిశారు. ఒకటి రెండు రోజులలో తన నిర్ణయం ప్రకటిస్తానని విలేఖరులకు చెప్పారు. 

నల్గొండ నుంచి ఎంపీగా గెలిచిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరుకొంది. త్వరలో రోహిత్ రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడితే ఇక 5 మంది ఎమ్మెల్యేలు మిగులుతారు. మిగిలిన ఐదుగురిలో జగ్గారెడ్డి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తెరాసలో చేరవచ్చునని సమాచారం. కనుక చివరికి మల్లు భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే పార్టీలో మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. 

లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో 3 సీట్లు గెలుచుకొన్నప్పుడు కాంగ్రెస్ పార్టీయే తెరాసకు ప్రత్యామ్నాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు వాదించారు. కానీ రాష్ట్రంలో తెరాస దాటికి ఎదురునిలిచి ఎంతగా పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశతో ఉన్న వారు ముగ్గురూ ఇప్పుడు ఎంపీలుగా గెలిచినందున జాతీయ రాజకీయాలలో పాల్గొనే మిషతో డిల్లీకి వెళ్లిపోయినట్లయితే, ఇక తెరాస ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ పార్టీ దానంతట అదే క్రమంగా కుప్పకూలిపోయినా ఆశ్చర్యం లేదు. తెరాసకు ప్రత్యామ్నాయంగా బలపడుతుందనుకొన్న కాంగ్రెస్ పార్టీ చివరికి తెరాసాలోనే విలీనం అవుతుండటం చాలా విచిత్రమే కదా. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్‌ భవిష్యత్ అగమ్యగోచరంగా కనిపిస్తోంది. 


Related Post