ఉత్తమ్, కోమటిరెడ్డి కాడి పడేసినట్లేనా?

June 05, 2019


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నికైనందున ఈరోజు సాయంత్రం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. ఎంపీగా ఎన్నికైనందున పిసిసి అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పుకొని జాతీయ రాజకీయాలలో పాల్గొనాలనుకొంటున్నానని కనుక తన స్థానంలో వేరెవరినైనా నియమించాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి గత నాలుగున్నరేళ్ళుగా పిసిసి అధ్యక్షుడు కొనసాగుతున్నారు. సుమారు ఏడాదిన్నర క్రితం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ పదవిని ఆశించారు. తనకు పగ్గాలు అప్పగించినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నిస్తానని అనేవారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం అందుకు అంగీకరించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం సంగతి అటుంచి, అసెంబ్లీ ఎన్నికలలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోలేకపోయారు. ఆయనే గెలవలేకపోయారు. ఆ షాక్ నుంచి కోలుకొని భువనగిరి నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు.

ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వచ్ఛందంగా తప్పుకొంటున్నారు కనుక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆ పదవిని చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయవచ్చు. కానీ ఇప్పుడు ఆ పదవిపై తనకు ఏ మాత్రం ఆసక్తి లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పడం విశేషం.

ఎంపీగా ఎన్నికైనందున జాతీయ రాజకీయాలలో పాల్గొనాలనే సాకుతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ భారం దించుకొనే ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నందున పార్టీని గట్టెకించడం చాలా కష్టమనే ఆలోచనతోనే పిసిసి అధ్యక్ష పదవి చేపట్టడానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తి చూపడం లేదనుకోవలసి ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్‌ కాడి కిందపడేసి డిల్లీ వెళ్ళిపోవాలనుకొంటున్నారు కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టే ధైర్యం ఎవరికుంది? తెరాస, బిజెపిలను తట్టుకొంటూ పార్టీని ఏవిధంగా బ్రతికించుకొంటారో చూడాలి?


Related Post