తెరాస, వైసీపీలు ఎన్డీయేలో చేరుతాయా?

June 04, 2019


img

కేంద్రసహాయమంత్రి రాందాస్ అథ్వాలే ఇటీవల డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లకు ఒక  విజ్ఞప్తి చేస్తున్నాను. వారి రెండు పార్టీలు కూడా మా ఎన్డీయే కూటమిలో చేరాలని కోరుకొంటున్నాను. ప్రస్తుతం మా ప్రభుత్వానికి ఎవరి మద్దతు అవసరం లేదు. కానీ ‘సబ్ కా సాత్...సబ్ కా వికాస్’ (అందరి అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేద్దాం) అనే నినాదంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది కనుక మీరిరువురూ కూడా మా ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా జేరి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకొంటున్నాను. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఆలోచనలు చేయడం నిరుపయోగమేనని భావిస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డికి నా సలహా ఏమిటంటే గతంలో చంద్రబాబునాయుడు చేసిన తప్పులనే చేయవద్దని. బిజెపిని, ఎన్డీయేని అకారణంగా ద్వేషిస్తూ శత్రువులుగా చూడవద్దని ఇద్దరు ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

గతంలోనే అప్పటి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిఎం కేసీఆర్‌ను ఎన్డీయేలో చేరవలసిందిగా ఆహ్వానిస్తే కేసీఆర్‌ స్పందించలేదు. కానీ ఆనాటి పరిస్థితులు వేరు..నేటి రాజకీయ పరిస్థితులు వేరు. కేసీఆర్‌ అంచనాలకు భిన్నంగా ఇప్పుడు బిజెపి సొంతంగానే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసుకొంది కనుక ఇక ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనలు చేయడం వలన కొత్తగా ఒరిగేదేమీ ఉండదు పైగా అటువంటి ఆలోచనలు చేయదమంటే మోడీ, అమిత్ షాలకు సవాలు విసిరినట్లవుతుంది. ఆవిధంగా చేసినందుకే ఏపీలో చంద్రబాబునాయుడు పరిస్థితి హటాత్తుగా తారుమారైంది. కనుక అటువంటి పొరపాట్లు చేయవద్దని రాందాస్ అథ్వాలే స్పష్టంగానే హెచ్చరించారు. 

గత 5 ఏళ్ళలో సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగానే ఉన్నారు. ఇప్పుడూ అలాగే ఉండవచ్చు. జగన్‌ కూడా ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగానే ఉండక తప్పని స్థితి కనిపిస్తోంది. 

ఒకవేళ తెరాస, వైసీపీలు ఎన్డీయేలో చేరినట్లయితే వాటికి కేంద్రం నుంచి సహాయసహకారాలు అందుతాయి కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బిజెపి ఎదుగుదలకు అవి కూడా సహకరించవలసి ఉంటుందనేది బహిరంగ రహస్యం. ఒకవేళ అవి ఎన్డీయేలో చేరకపోయినా బిజెపి తదుపరి లక్ష్యం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలే కనుక ఇద్దరు ముఖ్యమంత్రులకు కేంద్రం నుంచి సమస్యలు, సవాళ్ళు ఎదుర్కోవలసి రావచ్చు. కనుక దూరంగా ఉంటూ సమస్యలను ఎదుర్కోవడం కంటే ఎన్డీయేలో చేరడమే మంచిదనిపిస్తోంది. వారిరువురూ ఎన్డీయేలో చేరేందుకు ఇష్టపడతారా లేక దూరంగా ఉంటూ మోడీతో సఖ్యతను కొనసాగిస్తారా? అనేది మరికొన్ని వారాలు లేదా నెలల్లోనే స్పష్టం అవుతుంది.


Related Post