కేసీఆర్‌ చెప్పింది నిజమే కదా!

June 02, 2019


img

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి 5 సం.లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మాటన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం నిలద్రొక్కుకోవడానికి మొదటి 5సం.లే చాలా కీలకం. ఆ సమయంలో సరైన దిశలో బలమైన అడుగులు వేశాము కనుకనే ఇంత అభివృద్ధి సాధించగలిగామని అన్నారు. 

అది నూటికి నూరు పాళ్ళు నిజమే. ఒకవేళ ఆ సమయంలో తప్పటడుగులు వేస్తే రాష్ట్రం నిలద్రొక్కుకొని అభివృద్ధిపధంలో ముందుకు సాగడానికి చాలా సమయం పడుతుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది. 

రాష్ట్ర ప్రాధాన్యతలు మరిచి లేదా సరిగ్గా గుర్తించలేక రాజధాని నిర్మాణం, పారిశ్రామిక ప్రగతి, సహజవనరుల వినియోగం వంటి అతిముఖ్యమైన విషయాలలో గత ప్రభుత్వం తప్పటడుగులు వేసినందున 5 ఏళ్ళ తరువాత ఆ రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. 

కానీ సిఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర అవసరాలను, వనరులను, ఆర్ధిక, భౌగోళిక పరిస్థితులను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అన్నిటినీ చాలా చక్కగా గుర్తించి తదనుగుణంగా పక్కా ప్రణాళికలు రచించుకొని ఎన్ని సవాళ్ళు, సమస్యలు, అవరోదాలు ఎదురవుతున్నా ధైర్యంగా చాలా ఆత్మవిశ్వాసంతో వాటినన్నిటినీ ఎదుర్కొంటూ ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధించారు. 

ముఖ్యంగా దశాబ్ధాలుగా నిర్లక్ష్యానికి గురైన సాగునీరు, త్రాగునీరు, వ్యవసాయం, విద్యుత్, విద్యా, వైద్యం, ప్రజారోగ్యం, మౌలికవసతుల కల్పన, పారిశ్రామిక రంగాలకు అత్యంత సమర్ధులైన మంత్రులను, అధికారులను నియమించుకొని సత్ఫలితాలు రాబట్టగలిగారు. రాష్ట్రాభివృద్ధితోపాటు సామాజికాభివృద్ధికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో వివిద వర్గాలు, కులాలు, మతాలు, వృత్తులు చేసుకొనే ప్రజలకు జీవనోపాధికి మార్గాలు కల్పించారు. 

రాష్ట్రంలో జిల్లాలు, గ్రామ పంచాయితీలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను అన్నిటినీ సమూలంగా పునర్వ్యవస్థీకరించి ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లారు. రాష్ట్రాభివృద్ధిలో చాలా కీలకమైన మున్సిపల్, పంచాయితీ, రెవెన్యూ  వ్యవస్థలను, వాటి చట్టాలను, భూరికార్డులను ప్రక్షాళన చేసి పారదర్శకమైన పాలనకు శ్రీకారం చుట్టారు. 

దేశంలో మరే ప్రభుత్వం చేపట్టలేని కనీసం ఊహించలేనన్ని సంక్షేమ పధకాలు రూపొందించి అమలుచేస్తుండటంతో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ప్రజల కష్టాలను, సమస్యలను, వారి అవసరాలను గుర్తించి వారికి మేలు కలిగేవిధంగా పధకాలను రూపొందించడంతో ఆయన ప్రవేశపెట్టిన పధకాలలో దాదాపు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒంటరి మహిళలకు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు పింఛను ఇవ్వాలనే ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి సిఎం కేసీఆర్‌ అంటే అతిశయోక్తి కాదు. కిడ్నీ పేషెంట్ల కోసం డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, గ్రామీణ ప్రజలకు కళ్ల పరీక్షలు, బతుకమ్మ చీరల పంపిణీ, చనిపోయిన లేదా ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలు రోడ్డున పడకుండా జీవితభీమా వంటివన్నీ పాలనలో మానవతావాదానికి నిదర్శనంగా నిలుస్తాయి.   

కేంద్రప్రభుత్వం సైతం కేసీఆర్‌ పధకాలను ఆదర్శంగా తీసుకొని పదకాలు రూపొందించుకొంటోందంటే వాటికి ఎంతటి గుర్తింపు ప్రజాధారణ లభిస్తోందో అర్ధం చేసుకోవచ్చు. కేసీఆర్‌లో రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి ఇవన్నీ చూస్తే పరిపాలనలో క్వాలిటీని, మానవత్వాన్ని పరిచయం చేసిన గొప్ప పరిపాలకుడిగా ఆయన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. తెలంగాణ సమస్యలు, అవసరాలు, వనరులు, చేయవలసిన పనుల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ప్రజలు ఎన్నుకొన్నందునే 5 ఏళ్ళ వ్యవదిలో ఇంత అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని చెప్పవచ్చు. 

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మైతెలంగాణ.కామ్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. నేటి ఈ అభివృద్ధి కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన అమరవీరులందరికీ హృదయపూర్వక నివాళులు ఆర్పిస్తోంది.



Related Post