ఆ బాధ్యత సోనియా గాంధీకే

June 01, 2019


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా బాధ్యత చేపట్టడానికి నిరాకరించడంతో కాంగ్రెస్‌ ఎంపీలు యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీని తమ నాయకురాలిగా ఎన్నుకొన్నారు. ఆమె లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేతగా వ్యవహరిస్తారు. అయితే లోక్‌సభలో ప్రధానప్రతిపక్ష హోదా లభించాలంటే కనీసం 55 సీట్లు అవసరం కాగా కాంగ్రెస్ పార్టీకి 52 మాత్రమే వచ్చాయి. కనుక ప్రధానప్రతిపక్ష హోదా లభించే అవకాశం కనిపించడం లేదు. ఆమెను కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నుకొన్న తరువాత రాహుల్ గాంధీ స్పందించారు. ఆమె నేతృత్వంలో 52మంది  ఎంపీలు కలిసి మోడీ ప్రభుత్వంతో పోరాడుతామని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ కాంగ్రెస్‌లో ప్రతీ ఒక్కరు దేశప్రజల తరపున ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్నామని గుర్తుంచుకోవాలని అన్నారు.  

కాంగ్రెస్ పార్టీ తన ముక్కు కంటే ఎక్కువ దూరం చూడలేదని చెప్పడానికి ఇదే చక్కటి ఉదాహరణ. ఒకపక్క రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి నిరాకరిస్తున్నప్పటికీ ఆయనే కొనసాగాలని అందరూ బ్రతిమలాడుతున్నారు తప్ప బయటవారికి అవకాశం ఇవ్వాలనుకోవడం లేదు. ఒకవేళ రాహుల్ గాంధీ అధ్యక్షుడుగా కొనసాగదలచుకోకపోతే ప్రియాంకా వాద్రా ఆ బాధ్యతలు చేపట్టాలని కోరుకొంటున్నారు. అలాగే సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఆమెనే ఎన్నుకొన్నారు తప్ప పార్టీలో వేరెవరికీ ఆ బాధ్యతలు అప్పజెప్పడానికి ఇష్టపడలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్నా పరువాలేదు కానీ సోనియా, రాహుల్, ప్రియాంకా వాద్రాలు తప్ప మరెవరూ పార్టీ పగ్గాలు చేపట్టరాదన్నట్లుంది.


Related Post