రాష్ట్రం దాటితే కేసీఆర్‌ చెల్లని రూపాయే: కిషన్‌రెడ్డి

May 24, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి డీలాపడిపోయిన బిజెపికి రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగింది. రాష్ట్ర బిజెపి నేతలలో కొత్త ఉత్సాహం వచ్చింది. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ రాష్ట్రం దాటితే చెల్లని రూపాయేనని లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో స్పష్టం అయిపోయింది. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ఆయన చాలా హడావుడి చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది. కనీసం ఆయన కోరుకొన్నట్లు 16 ఎంపీ సీట్లైనా గెలుచుకోలేకపోయారు. మితిమీరిన అహంకారంతో నిరంకుశ పాలన సాగిస్తున్న సిఎం కేసీఆర్‌కు లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇకనైనా ఆయన వైఖరి మార్చుకొని ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తే మంచిది,” అని అన్నారు. 

ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన వాస్తవ రాజకీయ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉందనే సంగతి అందరికీ తెలుసు. అందుకే దేశంలో ఏ ప్రాంతీయపార్టీ కూడా దానికి మద్దతు పలుకలేదు. “కేంద్రంలో కాంగ్రెస్‌, బిజెపిలకు పూర్తి మెజార్టీ రాకపోతే ఫెడరల్‌ ఫ్రంట్‌ చక్రం తిప్పొచ్చు” అనే ఒక ఊహాజనితమైన ఆలోచనతో చేసిన ఆ ప్రతిపాదనను ఇప్పుడు అటకెక్కించక తప్పదు. 

అయితే లోక్‌సభ ఫలితాలు ఈవిధంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందనే సంగతి సిఎం కేసీఆర్‌కు తెలియకనే ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో హడావుడి చేశారా? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. నిజానికి ఊహాజనితమైన ఆ ప్రతిపాదనతో ప్రజలలో సెంటిమెంటు రగిలించి లోక్‌సభ ఎన్నికలలో 16 ఎంపీ సీట్లు గెలుచుకోవడమే ఆయన ఉద్దేశ్యం కావచ్చు. కానీ 16 కాకపోయిన 9 సీట్లు గెలుచుకోగలిగారు. కనుక ఫెడరల్‌ ఫ్రంట్‌ అనే ఐడియా బాగానే వర్కవుట్ అయిందనే భావించవచ్చు.


Related Post