కేసీఆర్‌ క్యాబినెట్లో కవితక్కకు స్థానం కల్పిస్తే?

May 24, 2019


img

లోక్‌సభ ఎన్నికల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, దానిలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పారు. లోక్‌సభ ఫలితాలు కూడా వచ్చేశాయి కనుక ఇక మంత్రివర్గ విస్తరణకు కసరత్తు మొదలుపెట్టవచ్చు. ఇప్పటివరకు తెరాస మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ఎవరో ఇద్దరికి మంత్రిపదవులు లభిస్తాయనే అందరూ భావిస్తున్నారు. కానీ లోక్‌సభ ఎన్నికలలో నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన కవిత ఓడిపోవడంతో ఇప్పుడు ఆమె గురించి కూడా ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. 

మళ్ళీ 5 ఏళ్ళ వరకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు లేవు కనుక మంచి కార్యదక్షత కలిగిన ఆమెను పక్కన పెట్టడం సరికాదు. కనుక ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోవడమే మంచిది. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకొంటే సిఎం కేసీఆర్‌ కుటుంబపాలన చేస్తున్నారనే విమర్శలు మళ్ళీ మొదలవవచ్చు కానీ ఆ విమర్శలకు ఆమె తన పనితీరుతో సమాధానం చెప్పగలరని ఖచ్చితంగా చెప్పవచ్చు. లోక్‌సభలో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా సాక్షాత్ ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రశంశలు అందుకొన్న కవితను మంత్రివర్గంలోకి తీసుకొన్నట్లయితే ఆమె రాష్ట్ర ప్రభుత్వానికే వన్నె తేగలరని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి సిఎం కేసీఆర్‌ ఆమెకు అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి.


Related Post