మోడీ విజయంపై విజయశాంతి స్పందన

May 24, 2019


img

కేంద్రంలో మళ్ళీ మోడీ నాయకత్వంలో ఎన్డీయే భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంపై తెలంగాణ కాంగ్రెస్‌ మహిళనేత విజయశాంతి తనదైన శైలిలో స్పందించారు. “లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన అన్ని పార్టీల అభ్యర్ధులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాను. అయితే ఎన్డీయేకు అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పు సరైనదో అవునో కాదో కాలమే చెపుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మెరుగైన ఫలితాలు అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.  

మతతత్వవాదం ప్రేరేపించడం, దళితులు, మైనార్టీలపై దాడులు, నోట్లరద్దు, జిఎస్టీ వంటి నిర్ణయాల కారణంగా నరేంద్రమోడీ పట్ల దేశప్రజలలో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. కనుక ఈసారి బిజెపికి 200కు మించి సీట్లు రాకపోవచ్చునని కేసీఆర్‌ వంటి రాజకీయమేధావులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా బిజెపి సొంతంగానే 303 స్థానాలు గెలుచుకొని తిరుగులేని మెజార్టీ సాధించింది. అందుకు నరేంద్రమోడీ, అమిత్ షాల ఎన్నికల వ్యూహాలే కారణమని చెప్పక తప్పదు. కనుక విజయశాంతి చెప్పినట్లు ఎన్డీయేకు అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పు సరైనదో అవునో కాదో కాలమే చెపుతుంది. 

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించిన తెరాస అదే ఊపులో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 16 సీట్లు గెలుచుకోవడం ఖాయమనే అందరూ భావించారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 3, బిజెపికు 4 ఎంపీ సీట్లు కట్టబెట్టడం అనూహ్యమే. కాంగ్రెస్‌, బిజెపి అభ్యర్దులు సొంతబలంతోనే గెలిచారని చెప్పవచ్చు.


Related Post