మోత్కుపల్లిపై దాడి కేసులో కొత్తకోణం

October 31, 2018


img

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు నుంచి బిఎల్ఎఫ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులుపై అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేయబోతున్న భిక్షమయ్య గౌడ్ అనుచరులు మంగళవారం దాడి చేయడంతో మోత్కుపల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు భిక్షమయ్య గౌడ్, అనుచరులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 279, 504, 506, 143 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 దీనిపై భిక్షమయ్య గౌడ్ స్పందిస్తూ, “మోత్కుపల్లి నర్సింహులు, నేను ఎన్నికల ప్రచారంలో  చేసుకొంటున్నప్పుడు మల్లాపురంలో ఒకరికొకరం ఎదురుపడిన మాట వాస్తవం. అప్పుడు ఇద్దరం పరస్పరం అభివాదం చేసుకొంటూ ముందుకు సాగిపోయాము. కానీ నేను ఉద్దేశ్యపూర్వకంగానే నా వాహనంతో ఆయన వాహనాన్ని గుద్దించానని ఆయన అనుచరులు మాతో వాగ్వాదానికి దిగారు. కానీ వారితో ఘర్షణ పడటం ఇష్టంలేని మేము వారిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాము. నేను నా వాహనం దిగలేదు. మా ఇద్దరి వాహనాలకు మద్య చాలా ఖాళీ ఉంది కూడా. కానీ మోత్కుపల్లి ఉద్దేశ్యపూర్వకంగానే రోడ్డుపై బైటాయించి హడావుడి చేసి నాపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారు. ఆయనకు తెరాసతో రహస్య అవగాహన ఉందనే సంగతి అందరికీ తెలుసు. అందుకే పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి నాపై కేసులు నమోదు చేశారు. కానీ ఈ ఘటనలో మా తప్పేమీ లేదు. మేము పోలీసుల అనుమతితోనే ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నాము. కనుక ఇటువంటి బెదిరింపులకు కేసులకు భయపడబోము,” అని భిక్షమయ్య గౌడ్ అన్నారు.

మోత్కుపల్లి నర్సింహులు టిడిపిని తెరాసలో విలీనం చేసేయాలని చెప్పడం, ఆ కారణంగా పార్టీ నుంచి బహిష్కరించడం, ఆ తరువాత తెరాస అధినేతను ప్రసన్నం చేసుకోవాలనే తపనతో చంద్రబాబు నాయుడుని తిట్టడం, సుమారు నెలరోజుల క్రిందట యాదగిరిగుట్ట వద్ద ‘మోత్కుపల్లి శంఖారావం’ పేరిట నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ “సిఎం కేసీఆర్‌గారు... మీరు నన్ను, నా సేవలను ఉపయోగించుకొన్నట్లయితే జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో తెరాసను గెలిపిస్తాను,” అని అనడం వంటివన్నీ ఆయన తెరాసకు అనుకూలమని స్పష్టం చేస్తున్నాయి. కనుక ప్రస్తుతం ఆయన బిఎల్ఎఫ్ టికెట్ పై పోటీ చేస్తున్నా ఒకవేళ గెలిచినట్లయితే ఎన్నికల తరువాత తెరాసలోకి వెళ్లిపోయే అవకాశాలున్నాయని భావించ వచ్చు. గెలవకపోయినా కాంగ్రెస్‌ అభ్యర్ధి విజయావకాశాలను దెబ్బ తీయగల శక్తి ఆయనకుంది కనుక తెరాస కూడా ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తే ఆశ్చర్యం లేదు. కనుక భిక్షమయ్య గౌడ్ ఆరోపణలు కాదనలేము.


Related Post