అజారుద్దీన్ మళ్ళీ బ్యాటింగ్ షురూ?

July 18, 2018


img

టీం ఇండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ మళ్ళీ జోరుగా బ్యాటింగ్ మొదలుపెట్టారు. అయితే ఈసారి క్రికెట్ మైదానంలో కాకుండా కాంగ్రెస్ పార్టీలో షురూ చేయడం విశేషం. తాను సికింద్రాబాద్ నుంచి లోక్ సభ సభకు పోటీ చేయాలనుకొంటున్నానని రెండు రోజుల క్రితం ఏకపక్షంగా ప్రకటించేసి బ్యాటింగ్ షురూ చేశారు. వెంటనే అంజన్ కుమార్ యాదవ్ ‘దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచి చూపించు’ అంటూ ఆయనకు సవాలు విసిర అవుట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అజారుద్దీన్ కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ‘నీకు దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేసి అసదుద్దీన్ ఓవైసీని ఓడించి చూపించు’ అంటూ మళ్ళీ షాట్ కొట్టారు. కనుక ఇప్పుడు బంతి అంజన్ కుమార్ చేతిలో పడింది. ఆయనేమి చేస్తారో చూద్దాం. 

కానీ విచిత్రమేమిటంటే అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పాతబస్తీలో నివాసం ఉంటూ సికింద్రాబాద్ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకొంటున్నారు. అజారుద్దీన్ సికింద్రాబాద్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నందున తన నియోజకవర్గంలో తానే పోటీ చేయాలనుకొంటున్నారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు అయన హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేసి గెలిస్తే నగరంలో పార్టీకి పట్టుపెరుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం. కానీ అయన సికింద్రాబాద్ నుంచే పోటీ చేయాలనుకొంటున్నారు. దానికోసం అంజన్ కుమార్ యాదవ్ తో అప్పుడే బ్యాటింగ్ కూడా ప్రారంభించేశారు. కనుక వారిద్దరిలో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చూడాలి.


Related Post