కరీంనగర్ లో జరిగిన తెలంగాణా రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహనా సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రప్రభుత్వం విధానాలను తప్పుపడుతూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశ్యించి ‘ఆయనేమైనా గడ్డి పీకుతున్నారా?’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడినందుకు రాష్ట్ర భాజపా నేతలు కేంద్రానికి, గవర్నర్ నరసింహన్ కు పిర్యాదులు చేశారు కూడా. అంతటితో ఆ వివాదం సద్దు మణిగింది అనుకొంటుండగా ఊహించని విధంగా అది మరో కొత్త మలుపు తిరిగింది.
రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల ఏరో స్పేస్ పారిశ్రామికవాడలో టాటా-బోయింగ్ సమస్థలు కలిసి నిర్మించిన బోయింగ్ విమానాల తయారీ సంస్థను ప్రారంభించడానికి గురువారం ఉదయం రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చారు. అయితే అంతకు ముందు రోజే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ కార్యక్రమానికి హాజరయ్యే ముందు ఆమె మంత్రి కేటిఆర్ ను ఆ వ్యాఖ్యలపై సంజాయిషీ కోరారు.
‘ఆయన (కెసిఆర్) ఆవిధంగా అని ఉండరని..అని ఉంటే పొరపాటున నోరు జారి ఉండవచ్చని, ప్రధానమంత్రిని కించపరచడం కెసిఆర్ ఉద్దేశ్యం కాదని’ కేటిఆర్ సంజాయిషీ ఇచ్చారని..అది సంతృప్తికరంగా ఉన్నందునే ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈరోజు కార్యక్రమానికి హాజరైనప్పుడు కూడా మళ్ళీ మరోసారి నిలదీసి అడిగానని ఆమె చెప్పారు.
ఈ విషయాన్ని ఆమె బయటపెట్టకుండా ఉండి ఉంటే ఇక్కడితో ఆ సమస్య ముగిసి ఉండేది. కానీ ‘కెసిఆర్ నోరు జారడం తప్పేనని..అందుకు కేటిఆర్ విచారం వ్యక్తం చేశారని’ ఆమె మీడియా సమక్షంలో బహిరంగపరచడంతో తెరాసకు ఇబ్బందికరపరిస్థితి ఏర్పడింది. కనుక ఇప్పుడు తెరాస దీనిపై స్పందించకుండా మౌనం వహిస్తే ఇక్కడితో ఈ సమస్య ముగుస్తుంది. అలాకాక తెరాస నేతలు నిర్మలా సీతారామన్ పై ఎదురుదాడికి ప్రయత్నిస్తే తెరాస-భాజపాల మద్య సరికొత్త రాజకీయ యుద్ధం మొదలవుతుంది.