జానాబాబా 40 దొంగలు: కేటిఆర్

March 01, 2018


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో టి-కాంగ్రెస్ నేతలందరూ కలిసి ప్రజా చైతన్యయాత్ర పేరిట బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు తెరాస సర్కార్...దాని ముఖ్యమంత్రి కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు, తీవ్ర ఆరోపణలు చేస్తున్నందున తెరాస నేతలు కూడా వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. 

మంత్రి కేటిఆర్ బుధవారం సూర్యాపేటలో మిషన్ భగీరధ నుంచి 175 గ్రామాలకు మంచినీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ బస్సు యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతలందరూ దొంగల ముఠా అని అభివర్ణించారు.

“ఆలీబాబా 40 దొంగలు అన్నట్లుగా ఇప్పుడు ‘జానాబాబా 40 దొంగల ముఠా’ నిసిగ్గుగా బస్సుయాత్ర చేస్తున్నారు. వారిలో చాలా మందిపై కేసులున్నాయి. వారిలో కొంతమంది నేటికీ సిబిఐ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. సుమారు 55 ఏళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. అన్నేళ్ళు పాలించినా అది తెలంగాణాకు, ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు వారు చేసిందేమీ లేదు. నల్లగొండకు చెందిన జానారెడ్డి 15 ఏళ్ళపాటు మంత్రిగా ఉన్నారు. కానీ అయన ఫ్లోరోసిస్ సమస్యతో బాధపడుతున్న జిల్లావాసులను ఏనాడూ పట్టించుకోలేదు. దాని గురించి అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడే సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు మోసలి కన్నీళ్లు కారుస్తూ ప్రగల్భాలు పలుకుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏనాడూ తమ ముఖ్యమంత్రులతో తెలంగాణా ప్రయోజనాల కోసం నిలదీసే సాహసం చేయలేకపోయారు.  

ఎప్పుడో జవహార్ లాల్ హయంలో 45 ఏళ్ళ క్రితం శ్రీరాం సాగర్ కు శంఖుస్థాపన జరిగితే ఇప్పటి వరకు కాలువలలో నీళ్ళు ఎందుకు పారించలేకపోయారు? ఇప్పుడు మేము వాటి ద్వారానే ఈ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్ళు అందించబోతున్నాము. ఈ మూడున్నరేళ్ళలో జిల్లాకు నీళ్ళు అందించడమే కాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి అనేకమందికి ఉద్యోగఉపాది అవకాశాలు కల్పించాము. కానీ జానాబాబా ముఠా తెలంగాణా రాష్ట్రానికి, ప్రజల సంక్షేమం కోసమే చేసిందేమీ లేకపోయినా, మేము చేస్తున్న పనులకు కూడా అడ్డుతగులుతున్నారు. పైగా నిసిగ్గుగా బస్సు యాత్రలకు బయలుదేరారు,” అని మంత్రి కేటిఆర్ ఎద్దేవా చేశారు. 

మంత్రి కేటిఆర్ చేసిన విమర్శలు కొంచెం ఘాటుగా ఉన్నా అవి వాస్తవాలే అని అందరికీ తెలుసు. కాంగ్రెస్ హయంలో తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ పదవులు, అధికారం కోసం ప్రాకులాడారే తప్ప ఏనాడూ తెలంగాణా ప్రజల కష్టాలను పట్టించుకోలేదు. పదవులు, అధికారం సంపాదించుకొనేందుకు ఆంధ్రా పాలకులకు సలాములు చేస్తూ గులాములుగా మిగిలిపోయారు. ఆనాడే వారు తెలంగాణా ప్రయోజనాలను కాపాడి, ప్రజా సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేసుంటే నేడు వారిని ఎవరూ ఈవిధంగా వేలెత్తి చూపగలిగి ఉండేవారే కాదు కదా! 


Related Post