2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దేశప్రజలు ఎందుకు ఓడించారో అందరికీ తెలుసు. మోడీ సర్కార్ చేపడుతున్న సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకొనేవారు కోకొల్లలున్నారు. అలాగే మత అసహనం, అయన నిరంకుశ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు. కానీ గత యూపియే పాలనతో పోలిస్తే దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తప్పో ఒప్పో..విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకోబడుతున్నాయి. తప్పో ఒప్పో ...నిరంతరంగా సంస్కరణలు అమలవుతున్నాయి. కానీ ఇదే సమయంలో మోడీ సర్కార్ అమలుచేసిన నోట్లరద్దు, జి.ఎస్.టి., నగదురహిత లావాదేవీల వలన నష్టపోయినవారు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక తరువాత భాజపాకు బలం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలలో వ్యతిరేకత పెరిగింది. రాజకీయ కారణాల చేత రెండు రాష్ట్రాలలో భాజపా ఇదివరకు ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలలో భాజపాకు ఎదురుగాలి వీస్తోంది. మిత్రులు, మిత్రపక్షాలు దూరం జరుగుతున్నారు. కారణాలు ఎవైతేనేమి, మోడీ అధికారం చేపట్టిన కొత్తలో ఉన్నంత అనుకూల వాతావరణం ఇప్పుడు లేదనే చెప్పాలి.
ఈ పరిస్థితులను చూసి కాంగ్రెస్ పార్టీ ఆశపడటం సహజమే. అందుకే రాహుల్ గాంధీ ‘కాబోయే ప్రధానమంత్రి’ అని కాంగ్రెస్ నేతలు గట్టిగా నొక్కి చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఒకప్పుడు ఆయనను పార్టీ అధ్యక్ష పదవి చేపట్టబోతేనే ‘ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవు..ఆ పదవి చేపట్టడానికి అనర్హుడు..’ అని అభ్యంతరాలు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి ఏవిధంగా అర్హుడని భావిస్తున్నారో చెపితే బాగుంటుంది. నిజానికి పదేళ్ళపాటు యూపియే అధికారంలో ఉన్నప్పుడు, పార్టీలో, ప్రభుత్వంలో అందరి మద్దతు, పూర్తి అనుకూలవాతవరణం, తల్లి అందదండలు ఉన్నపుడే రాహుల్ గాంధీకి ఆ పదవి చేపట్టడానికి భయపడి చేజేతులా ఒక సువర్ణావకాశాన్ని వదులుకొన్నారు. అప్పుడే అయన ప్రధాని పదవి చేపట్టి ఉండి ఉంటే ఆయన సత్తా ఏపాటిదో ప్రజలకు, పార్టీ నేతలకు, ప్రత్యర్ధులకు కూడా తెలిసి ఉండేది.
ఇక యూపియే హయాంలో ఒక వెలుగు వెలిగిన రాహుల్ గాంధీ తమ పాలనలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోలేకపోయారు. అడ్డుకోలేకపోయారనే కంటే అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు అనడమే సమంజసం. అంతేకాదు..నేటికీ యూపియే హయంలో అవినీతి జరిగిందని అంగీకరించడం లేదు. అయన ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా...యూపియే సర్కార్ పాలనకు ఆయన కూడా బాద్యత వహించక తప్పదు. కనుక అయన అధికారం చేపడితే దేశాన్ని ఏవిధంగా పాలిస్తారనేదానికి గత యూపియే పాలననే గీటురాయిగా లేదా కొలమానంగా భావించక తప్పదు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికలలో దేశప్రజలు మోడీ, రాహుల్ ఇద్దరిలో ఎవరికి పట్టంకట్టే అవకాశం ఉందో ఊహించుకోవచ్చు.