టి.ఆర్.టి.పరీక్షలను సరిగ్గా వ్రాయలేక ఇక తనకు ప్రభుత్వోద్యోగం లభించదని, తల్లితండ్రులకు భారంగా మారానని, తన జీవితం వ్యర్ధమని భావిస్తూ కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డికి చెందిన జాప సుప్రజ (24) తీవ్రమనస్తపం చెంది బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.
ఆమె వ్రాసిన సూసైడ్ నోట్ ఆమె మనసులో ఎంత ఆందోళన చెందుతోందో అద్దం పట్టింది. తల్లితండ్రుల ఆశలు వమ్ము చేసిన తనను క్షమించమని కోరుతూ అర్ధాంతరంగా జీవితం ముగించింది.
పరీక్షల ఒత్తిడికి గురవుతున్న విద్యార్ధులు, ఉద్యోగాల కోసం విఫలయత్నాలు చేస్తున్న యువతీయువకులు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. చదువులు, ఉద్యోగం జీవితంలో ఒక భాగం మాత్రమే అవే జీవితం కావు. పరీక్షలలో తక్కువ మార్కులు వస్తాయనో లేకపోతే ఫెయిల్ అవుతామనే భయంతోనో లేక పరీక్షల ఒత్తిళ్ళ కారణంగానో ఆత్మహత్యలు చేసుకోవడం అనవసరం. తొందరపాటు అవుతుంది. ఎందుకంటే, ఈ ప్రపంచంలో అసలు ఏ చదువులేని వారు కొన్ని కోట్లమంది నిండు నూరేళ్ళు బ్రతుకుతున్నారు. కనుక తాము చదువలేకపోతున్న ఆ చదువులను వదిలేస్తే ఏమవుతుంది? లేదా కాస్త తక్కువ మార్కులతో పాస్ అయితే ఏమవుతుంది? అసలు ఆ చదువులు ఎందుకు చదువుతున్నాము? అది చదవలేకపోతే బ్రతకలేమా? బ్రతకడానికి మరో మార్గం లేదా? అని ఆలోచించడం చాలా అవసరం.
అలాగే నిరుద్యోగులు, అందునా ఆడపిల్లలపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని సుప్రజ లేఖ ద్వారా స్పష్టమయ్యింది. అయితే ప్రభుత్వోద్యోగాలు లభించని వారందరి జీవితాలు వ్యర్ధమేనా?జీవితంలో విఫలం చెందినట్లేనా? సుప్రజలాగ ఆత్మహత్యలు చేసుకోవలసిందేనా? అని ఆలోచించితే ఆమె నిర్ణయం ఎంత తొందరపాటుతో తీసుకోన్నదో అర్ధం అవుతుంది. అయినా నిరుద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లభించడం సాధ్యమేనా? అని కూడా ఆలోచించాలి. దేశంలో కోట్లమంది ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు చేస్తూ హాయిగా జీవిస్తున్నారు. ఐటి, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, మొబైల్స్, హోటల్ ఇండస్ట్రీ వంటి అనేక రంగాలలో ప్రభుత్వోద్యోగాల కంటే ఎక్కువ జీతాలు లభిస్తున్నాయి. అవికాక స్వయం ఉపాధి మార్గాలు ఉండనే ఉన్నాయి.
మన దైనందిన అవసరాల కోసం తెల్లవారితే బజారులో టీకొట్టుకో..కూరగాయలు లేదా కిరాణా దుఖాణాలకో లేక జిరాక్స్ షాపులకో వెళుతుంటాము. కానీ మనం వాటి గురించి పెద్దగా ఆలోచించము. కానీ వాటిని నడుపుతున్న వారందరూ ప్రభుత్వోద్యోగులు కారు...ఏదో ఒకపని చేసి కుటుంబాలను పోషించుకొంటున్నారు. ప్రభుత్వోద్యోగాలు చేయకపోయినా ఉన్నంతలో హాయిగానే జీవిస్తున్నారు. మరింత నిశితంగా గమనిస్తే మళ్ళీ వారిలో కూడా బాగా రాణించి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగినవారు కూడా మనకు కనబడతారు.
కనుక ప్రభుత్వోద్యోగాలు లభించకపోతే జీవితం వ్యర్ధం...తల్లితండ్రులకు భారం...అని భావించి ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదు. ఉద్యోగం...సంపాదన అనేది బ్రతకడానికే. కనుక అవి లభించకపోతే చనిపోవాలనుకోవడం సరికాదు. చదువులు, పరీక్షల ఒత్తిళ్ళు, నిరుద్యోగ సమస్యలను ఎదుర్కొంటున్నవారు ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంకంటే తమ తల్లితండ్రులు, పెద్దవారు లేదా అనుభవజ్ఞులతో తమ సమస్యలను, మనసులో వ్యధను చెప్పుకొంటే వారు అనేక మార్గాలు చూపించే అవకాశం ఉంటుందని గ్రహించాలి.
ఇక కొందరు రాజకీయ నేతలు, మేధావులు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వోద్యోగాలు, నిరుద్యోగసమస్య గురించి మాట్లాడుతున్న మాటలను నిరుద్యోగులు పట్టించుకోకుండా ఉంటేనే మంచిది. మేధావి అనేవాడు ఎలా జీవించాలో చెప్పాలి కానీ సమస్యలను వల్లె వేయకూడదు...నిరాశను వ్యాపింపజేయకూడదు. చేస్తే అటువంటి వ్యక్తి మాటలను పట్టించుకొనక్కరలేదు.
చివరిగా ఒక మాట. శ్రీదేవి..అంబానీలు..టాటా బిర్లా.. మోడీ..కెసిఆర్...కేటిఆర్.. చంద్రబాబులతో సహా ప్రతీ మనిషికి వారి వారి స్థాయిలో సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు తప్పక ఉంటాయి. వాటిని తట్టుకొని ఎదురీదడమే జీవితం.