కాంగ్రెస్ నేత డికె అరుణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ, “నాలుగేళ్ళుగా రైతులను పట్టించుకొని కెసిఆర్ కు ఇప్పుడే రైతులు ఎందుకు గుర్తుకువచ్చేరంటే ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కనుక. రైతులను మభ్యపెట్టి వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతోనే కొత్తగా తెలంగాణా రైతు సమన్వయ సమితిలు, ఎకరానికి రూ.4,000 పంటపెట్టుబడి అంటూ సరికొత్త నాటకానికి తెరలేపారు. నిజానికి అవి రైతు సమితులు కావు. రౌడీ సమన్వయ సమితులు. వాటి అండతో ఎన్నికలలో గెలవచ్చని కెసిఆర్ కలలు గంటున్నట్లున్నారు. అయితే అయన తలక్రిందులుగా నిలబడి తపస్సు చేసినా వచ్చే ఎన్నికలలో ప్రజలు తెరాసకు ఓట్లేయరు. ఆయనను గద్దె దింపడం ఖాయం,” అని అన్నారు డికె అరుణ.
వచ్చే ఎన్నికలలో తెరాసకు ఖచ్చితంగా 106 సీట్లు గెలుచుకొంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న కూడా గట్టిగా చెప్పారు. తెలంగాణాను అన్నివిధాల భ్రష్టు పట్టించినవి కాంగ్రెస్, భాజపాలేనని మరోమారు గట్టిగా నొక్కి చెప్పారు. కనుక వచ్చే ఎన్నికలలో ఆ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించడం ఖాయమని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.
కానీ డికె అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా తమ పార్టీ గెలుపుపై అంతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, కెసిఆర్ కూడా అందుకు సిద్దమేనా? అని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ నిన్న కూడా సవాలు విసిరారు.
మొదట మంత్రి కేటిఆరే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ సవాలు విసిరారు. దానిని కాంగ్రెస్ నేతలు స్వీకరించడమే కాకుండా తిరిగి సవాలు విసురుతున్నప్పటికీ ఇప్పుడు తెరాస స్పందించకపోవడం గమనార్హం. ఇది కాంగ్రెస్ నేతలలో నమ్మకాన్ని, తెరాస అభాద్రతాభావానికి అద్దం పడుతోందని చెప్పవచ్చు. అయితే ఎన్నికల నాటికి రెండు పార్టీల సమీకరణాలు...వాటితో బాటే వాటి బలాబలాలు కూడా మారవచ్చు. కనుక ఎన్నికల దగ్గర పడేవరకు ఏ పార్టీని తక్కువా అంచనా వేయలేము ఎక్కువ అని అనలేము.