దేశంలో గనులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలనే కేంద్రప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కీలకమైన ప్రకటన చేశారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, “ఒకవేళ కేంద్రప్రభుత్వం సింగరేణి గనులను కూడా ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నిస్తే తెలంగాణా ప్రభుత్వం తప్పకుండా అడ్డుకొంటుంది. ఒకవేళ కేంద్రం సింగరేణిలోని తన వాటాను విక్రయించదలిస్తే, దానికి ఎంత మొత్తమైనా చెల్లించి తెలంగాణా ప్రభుత్వం సింగరేణిని కాపాడుకొంటుంది. సింగరేణిపై కేంద్రం పెత్తనం చేస్తామంటే కుదరదు. సుమారు వందేళ్ళ నుంచి ఏ దిక్కూ లేని జిల్లాలకు అన్నం పెట్టిన తల్లి సింగరేణి సంస్థ. కనుక ఆ తల్లిని, పిల్లలను తెలంగాణా ప్రభుత్వమే కాపాడుకొంటుంది. ప్రాణం పోయినా సింగరేణిని ప్రైవేట్ పరం కానీయము,” అని అన్నారు.
సింగరేణి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజం. ఒక్క సింగరేణినే కాకుండా ఆర్టీసి, రాష్ట్ర విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉత్పత్తి సంస్థల విషయంలో కూడా అయన ప్రభుత్వ వైఖరి చాలా సరైనది. గట్టిగా సమర్ధించవలసిందే. ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సహా దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ప్రాధాన్యతనిస్తుంటే, తెలంగాణా ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ సంస్థలకే ప్రాధాన్యం ఇస్తోంది. అదేవిధంగా ఆ సంస్థలకు అవసరమైన పరికరాలను, యంత్రాలను బి.హెచ్.ఈ.ఎల్.వంటి ప్రభుత్వరంగ సంస్థలకే ఇస్తూ అవి కూడా లాభాలబాటలో పయనించేలా చేస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తూనే మరోపక్క ప్రైవేట్ దోపిడీని నివారించగలుగుతున్నారు. కనుక సింగరేణితో సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన చాలా అభినందనీయం.