నోట్లరద్దుకు తీసిపోని మరో నిర్ణయం?

February 28, 2018


img

నోట్లరద్దు నిర్ణయం చాలా సాహసోపేతమైనదే కావచ్చు..దానివలన దేశానికి కొంత మేలు జరిగి ఉండవచ్చు కూడా. కానీ ఏడాదిన్నర కాలం గడిచిపోయినా దాని దుష్పరిణామాలను దేశప్రజలు నేటికీ అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం అటువంటిదే మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతోంది. అదే 15 ఏళ్ళు దాటిన వాహనాలను నిషేధించాలని. 

15 ఏళ్ళు దాటిన వాహనాలను రోడ్లపై తిరగడానికి అనుమతించకూడదని, వాటిని ‘తుక్కు’ క్రింద తీసివేయాలని నిర్ణయిస్తూ కేంద్రం ‘వెహికల్ స్క్రాపింగ్ పాలసీ డాక్యుమెంట్’ను జి.ఎస్.టి.మండలి పరిశీలనకు పంపబోతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధికశాఖ ఒక నోట్ తయారుచేస్తోంది. 

కాలం చెల్లిన ఆ పాత వాహనాల వలన దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరిగిపోతుండటమే అందుకు కారణమని కేంద్రం చెపుతున్నప్పటికీ, దీని వలన దేశంలో ఆటో మొబైల్ పరిశ్రమ 22 శాతం వృద్ధి సాధిస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పడం గమనిస్తే, వాటికి లబ్ది కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకొంటున్నారనే అనుమానం కలుగకమానదు.

ఈ నిర్ణయం ప్రభావం ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడుతుంది. ఎందుకంటే, రవాణాశాఖలో ఆర్టీసి బస్సులు, వివిధ ప్రభుత్వ శాఖలలో నేటికీ లక్షలాది పాతవాహనాలను వినియోగిస్తున్నారు. వాటన్నిటినీ ఒకేసారి తొలగించి వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయవలసి ఉంటుంది. దానికి లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. కనుక ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు  కేంద్రం రాయితీ ఇవ్వక తప్పదు. 

ఇక దేశంలో కోట్లాది ప్రైవేట్ వాహనాలున్నాయి. వాటన్నిటినీ ఒకేసారి నిషేధిస్తే దేశంలో రవాణావ్యవస్థ స్తంభించిపోతుంది. ఇక ఇది అమలులోకి వస్తే రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలను వినియోగిస్తున్న ప్రజలు మళ్ళీ నానా కష్టాలు పడకతప్పదు. 

ఒకవేళ పాతవాహనాలను కేంద్రం నిషేదించదలిస్తే, కనీసం 3 నుంచి 5 సం.ల వ్యవధిలో అంచెలంచెలుగా అమలుచేస్తే ఎటువంటి సమస్య ఉండదు. కానీ నోట్లరద్దులాగ ఒకేసారి నిషేధిస్తే, దేశం మళ్ళీ స్తంభించిపోవడం...ప్రజలు మళ్ళీ నానా ఇక్కట్లు పడటం ఖాయం. 

దేశంలో కోట్లాది మంది ప్రజలు కొత్త సైకిల్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారి పాతవాహనాలను తుక్కులో అమ్మేసి, కొత్త వాహనాలను కొనుక్కోమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుంది. పైగా ఒకేసారి అన్ని కోట్ల వాహనాలను మన ఆటోమొబైల్ కంపెనీలు అందించలేవు కూడా. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్రం మళ్ళీ ఇటువంటి ‘సాహసోపేతమైన నిర్ణయం’ తీసుకోవాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిని కేంద్రం ఏవిధంగా అమలుచేయబోతోందో త్వరలోనే స్పష్టత రావచ్చు.    



Related Post