రాజకీయ పార్టీలన్నీ రెండు పరస్పర విరుద్దమైన మాటలు చెపుతుంటాయి. 1.ప్రజాసేవ చేయడం. 2.అధికారంలోకి రావడం. నిజంగా ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే అధికారం లేకపోయినా చేయవచ్చని అనేక స్వచ్చంద సంస్థలు నిరూపిస్తున్నాయి.
అధికారం సంపాదించుకోవడం కోసం లేదా ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం తిప్పలు పడుతున్నప్పుడు మళ్ళీ ప్రజలకు సేవ చేయడం కోసమే తాము అధికారం కోరుకొంటున్నామని వారు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంటుంది. పదవులు, టికెట్ల కోసం రాజకీయ నేతల ఆరాటం, పోరాటాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నప్పుడు కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టగలమనుకోవడం విస్మయం కలిగిస్తుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి ‘ప్రజా చైతన్యయాత్ర’ పేరిట నిన్న చేవెళ్ళ నుంచి ప్రారంభించిన బస్సు యాత్ర కూడా ఈ కోవకు చెందినదే. వచ్చే ఎన్నికలలో గెలవడం కోసమే ఈ బస్సుయాత్ర చేపట్టారని వారే స్వయంగా చెప్పుకొంటున్నారు.
గత 7 దశాబ్దాలలో కాంగ్రెస్, భాజపా సర్కార్లు చేయలేని పనులను తెరాస సర్కార్ చేసి చూపిస్తోందని ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న గట్టిగా నొక్కి చెపుతుంటే, తెరాస సర్కార్ చేయలేని పనులను తాము చేసి చూపిస్తామని టి-కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం విశేషం.
రాష్ట్రంలో ఏటా 10,000 మంది దళితులకు 3 ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలన్నా 220 సం.లు పడుతుందని సీనియర్ నేత కె.జానారెడ్డి చెపుతుంటే, దళితులకు భూమి ఇవ్వలేనప్పుడు ఎకరాకు 5లక్షల చొప్పున మూడెకరాలకు 15 లక్షలు చొప్పున ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేయడం విశేషం.
అది ఆచరణసాధ్యం కాని హామీ అని తెలిసి ఉండి హామీ ఇవ్వడం తెరాస చేసిన తప్పు. దానికి బదులుగా 15 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం కూడా తప్పే. ఎందుకంటే అదీ ఆచరణసాధ్యం కాదు కనుక. తెరాస సర్కార్ చేయలేని వాటిని తాము అధికారంలోకి వస్తే చేసి చూపిస్తామని టి-కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ వారు కూడా దానిని అమలుచేయలేరు కనుక.
ఇక లక్ష రూపాయల వరకు పంటరుణాలను వాయిదాల పద్దతిలో తీర్చడానికే తెరాస సర్కార్ ఆపసోపాలు పడినప్పుడు, తాము అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2లక్షలు మాఫీ చేసేస్తామని టి-కాంగ్రెస్ నేతలు హామీ ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది.
ఇక తెరాస సర్కార్ రాష్ట్రాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని విమర్శిస్తున్న టి-కాంగ్రెస్ నేతలు మరి వారి హయాంలో అదేపని ఎందుకు చేశారు. రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ అదేపని చేయరని నమ్మకం ఏమిటి?
కాంగ్రెస్ పాలన ఏవిధంగా ఉంటుందో దేశ ప్రజలు చూశారు. తెరాస సర్కార్ పాలన ఏవిధంగా సాగుతోందో ప్రత్యక్షంగా చూస్తున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ఎవరికి అధికారం కట్టబెట్టాలో వారికి బాగా తెలుసు.
రాజకీయ నేతలు ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండే ప్రజలను చైతన్యపరచాలనుకొంటారు తప్ప తాము మారాలనుకోరు. మారితే ఆచరణ సాధ్యం కాని ఇటువంటి హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించరు కదా?