రాజకీయ పార్టీలకు కార్పోరేట్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, విదేశాలలో ఉన్న ప్రవాసభారతీయులు బారీగా విరాళాలు ఇస్తుంటారు. ఇంతకాలం వాటికి ఎటువంటి లెక్కలు ఉండేవి కావు. కనుక రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు వసూలు చేసేవి. ఆ డబ్బును ఎన్నికల సమయంలో వెదజల్లి అధికారంలోకి వచ్చేవి.
ఈ దురలవాటుకు కళ్ళెం వేయాలనే ఉద్దేశ్యంతో మోడీ సర్కార్ కొన్ని సంస్కరణలు ప్రవేశపెడుతోంది. రాజకీయ పార్టీలకు ఎవరు ఎంత విరాళం ఇవ్వాలన్నా బ్యాంకుల ద్వారా ఇవ్వాలనే షరతు విదించింది. దానికోసం వచ్చే నెల 1వ తేదీన ‘ఎన్నికల బాండ్లు’ విడుదల చేయబోతోంది. కేవలం 15వ తేదీ వరకు మాత్రమే అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని శాఖలలో లభిస్తాయి. వాటిని ఒకరు కానీ లేదా కొంతమంది కలిసిగానీ కొనుగోలు చేయవచ్చు. అలాగే కార్పోరేట్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, విదేశాలలో ఉన్న ప్రవాసభారతీయులు తదితరులు కూడా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
గత సార్వత్రిక ఎన్నికలలో లేదా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కనీసం 1 శాతం ఓట్లు సాధించిన పార్టీలకు మాత్రమే విరాళాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వదలచినవారు తమ పూర్తి వివరాలను బ్యాంక్ దరఖాస్తులో నింపవలసి ఉంటుంది.
పాత పెద్ద నోట్ల రద్దు చేసినప్పటి నుంచి దేశంలో నగదు కొరత ఏర్పడటం, ఆంక్షల కారణంగా దేశంలో బారీ నగదు లావాదేవీలు తగ్గడం సహజమే. ఈ ఎన్నికల బాండ్లతో రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించుకోవడం సులువే కానీ అవన్నీ ఆదాయపన్నుశాఖ కళ్ళలో పడతాయి కనుక వాటికి లెక్కలు అప్పజెప్పవలసి ఉంటుంది. కనుక వేరే మార్గాల ద్వారా నగదును ఏర్పాటు చేసుకోక తప్పదు.
కేంద్రప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నగదు చలామణిని ఎంతగా నియంత్రిస్తునప్పటికీ, రాజకీయ పార్టీలు ఏదో విధంగా తమకు అవసరమైన నగదును సమీకరించుకొని ఎన్నికలలో వెదజల్లుతున్నాయని చెన్నై, ఆర్.కె.నగర్ ఉపఎన్నికలు నిరూపించాయి.
ఏనుగులు పైకి చూపే దంతాలతో ఆహారం తినవు. ఆహారం నమిలి తినే దంతాలు నోట్లో వేరేగా ఉంటాయి. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల బాండ్ల ద్వారా సమీకరించుకొన్న సొమ్మును ఆదాయపన్ను శాఖకు, ఎన్నికల సంఘానికి, ప్రజలకు చూపేందుకు మాత్రమే ఉపయోగించుకొని, ఎన్నికలలో డబ్బు వెదజల్లేందుకు వేరే ఇతర మార్గాల ద్వారా నగదును సేకరించుకోవడం ఖాయం లేకుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలలో పోటీ చేయలేదు.