ఏపి, తెలంగాణా ఉమ్మడి హైకోర్టు విభజనకు సుమారు నాలుగేళ్ల తరువాత మెల్లగా పనులు ప్రారంభం అయ్యాయి. ఇన్నేళ్ళు మొండికేసిన ఏపి సర్కార్ ఇప్పుడు హైకోర్టు విభజనకు అంగీకరించడంతో ఇది సాధ్యపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపి రాజధాని అమరావతి ప్రాంతంలో తాత్కాలికంగా ఏపి హైకోర్టు ఏర్పాటు కోసం ‘సిటీ సివిల్ కోర్టు’ భవన సముదాయాన్ని నిర్మించి ఇస్తామని, శాశ్విత భవనాల నిర్మాణం పూర్తయ్యేవరకు వాటిలో ఏపి హైకోర్టును ఏర్పాటు చేయవలసిందిగా ఏపి సర్కార్ కోరింది. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన బిల్డింగ్ కమిటీ ఆ ప్రతిపాదనకు అంగీకరించి అదే విషయం హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి రమేశ్ రంగనాధన్ కు తెలియజేసింది. ఆ కమిటీ ఇచ్చిన సలహా మేరకు అయన గురువారం హైకోర్టు సమావేశ మందిరంలో ఫుల్ కోర్టును సమావేశపరిచి హైకోర్టు తరలింపుపై చర్చించారు. హైకోర్టు తరలింపుకు సభ్యులు అందరూ అంగీకరించారు.
మార్చి 15వ తేదీ నుంచి నిర్మాణ పనులు మొదలుపెట్టి 2018, ఆగస్ట్ నెలాఖరులోగా సిద్దం చేయాలని ఏపి సర్కార్ భావిస్తోంది. కనుక ఏపి సర్కార్ సిటీ సివిల్ కోర్టు సముదాయాన్ని నిర్మించి ఇవ్వగానే తరలింపు ప్రక్రియ మొదలుపెట్టాలని హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సభ్యులు నిర్ణయించారు. కానీ ఏపి సర్కార్ గడువులోగా నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వగలదా లేదా?ఒకవేళ భాజపాతో సంబంధాలు చెడినా అదే మాట మీద నిలబడుతుందా లేదా? అనే అనుమానాలున్నాయి.