తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డికి కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణా రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ కు చైర్మన్ గా నియమించబోతున్నట్లు తాజా సమాచారం. అయనకు ఆ పదవి ఇస్తారని ఇదివరకే మీడియాకు లీకులు అందాయి కనుక ఈ తాజా సమాచారం నిజమేనని భావించవచ్చు. మార్చి 18న ఉగాది రోజున ఈ కార్పోరేషన్ అధికారికంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది కనుక అదే రోజున గుత్తా సుఖేందర్ రెడ్డి దానికి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించవచ్చు. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులు జోడు పదవులు చేపట్టకూడదు కనుక ముందుగా ఆయన తన ఎంపి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. తెరాసకు సవాళ్ళు విసురుతున్న టి-కాంగ్రెస్ పార్టీకి, దాని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తమ సత్తా నిరూపించి చూపేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి చేత ఎంపి పదవికి రాజీనామా చేయించి ఉపఎన్నికలలో పోటీచేయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అనుకొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ అటువంటిదేమీ జరుగలేదు. కానీ ఇప్పుడు అయన రాజీనామా చేయకతప్పదు. కనుక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలు అనివార్యం కావచ్చు.
వచ్చే ఎన్నికలలో ఆ లోక్ సభ స్థానానికే పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆ అవకాశం ముందే రాబోతోంది గనుక గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తే అయన ఎగిరి గంతేయవచ్చు. ఉపఎన్నికలు వస్తే అప్పుడు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, తెరాస బలాబలాలు ఏపాటివో వాటికీ తెలిసివస్తుంది కూడా.