విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మోహల చోక్సీ వంటి ఆర్ధిక నేరగాళ్ళు ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద నుంచి వేలకోట్లు అప్పులు తీసుకొని తీర్చకుండా ఎగవేసి విదేశాలకు పారిపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇటువంటి ఆర్ధిక నేరగాళ్ళు వివిధ బ్యాంకుల వద్ద నుంచి తీసుకొన్న అప్పులు అక్షరాల రూ.49,03,180.79 లక్షల కోట్లు. వాటిలో రూ.25 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లు వరకు అప్పులు తీసుకొని ఎగవేసినవారున్నారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ‘ఎంత రాజకీయ పరపతికి అంత అప్పు’ లభిస్తుందనుకోవాలి.
బ్యాంకుల నుంచి డబ్బు తీసుకోవడానికి వారందరూ ‘అప్పు’ అనే పదం ఉపయోగిస్తున్నప్పటికీ దానిని తిరిగి తీర్చే ఉద్దేశ్యంతో మాత్రం తీసుకోవడంలేదని వరుసగా బయటపడుతున్న ఈ భాగోతాలు స్పష్టం చేస్తున్నాయి.
నీరవ్ మోడీ బ్యాంకులకు సుమారు రూ.11,400 కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన తరువాత అటువంటి కేసు మరొకటి బయటపడింది. యూపిలో కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న రోటోమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అధినేతలు విక్రం కొఠారి, అతని కుమారుడు రాహుల్ కొఠారి ఇద్దరూ కలిసి అలహాబాద్ బ్యాంక్ కు రూ.3,695 కోట్లు ఎగవేశారు. అయితే ఈసారి ఆ బ్యాంక్ ముందే జాగ్రత్తపడి సిబిఐకి పిర్యాదు చేయడంతో సిబిఐ అధికారులు గురువారం వారిరువురిని అదుపులోకి తీసుకొన్నారు. బహుశః వారికి తగినంత రాజకీయ పరపతి లేనందునే సిబిఐవారిని అదుపులోకి తీసుకోగలిగిందని భావించాల్సి ఉంటుంది.
కొందరు కేంద్రమంత్రులతో సహా రాష్ట్ర స్థాయి నేతల వరకు అనేకమంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని ఎగవేసినవారున్నారు. అటువంటి పలుకుబడి కలిగినవారు ఎగవేసిన ‘అప్పు’ లను వసూలు చేసుకోగలిగే ధైర్యం బ్యాంకులకు లేవు. ఉండి ఉంటే రూ.49,03,180.79 లక్షల కోట్ల బకాయిలు ఉండేవే కావు.
విజయ్ మాల్యా కధ మరిచిపోక ముందే నీరవ్ మోడీ కధ మొదలవడం, ఆ వెంటనే విక్రం కొఠారి కధ వెలుగు చూడటంతో కేంద్రంపై ప్రతిపక్షాల విమర్శలు పెరిగిపోయాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఇటువంటి అవినీతి ఆరోపణలు అధికార పార్టీకి రాజకీయంగా చాలా నష్టం చేస్తాయని వేరే చెప్పానవసరం లేదు. అందుకే విక్రం కొఠారి వంటి చిన్నచిన్న చేపలను గాలంవేసి పట్టుకొని చూపిస్తున్నారనుకోక తప్పదు.
అయితే వలవేసి పెద్ద చేపలను పట్టుకోవలసిన సమయంలో గాలం వేసి చిన్న చేపలను పట్టుకొనే చూపే ప్రయత్నాలు చేస్తునందునే ప్రభుత్వ చిత్తశుద్ధిని అనుమానించవలసివస్తోంది.