అదేంటి కమల్..జెండాలో పొరుగు రాష్ట్రాలెందుకు?

February 22, 2018


img

కమల్ హాసన్ స్థాపించిన ‘మక్కల్ నీతి మయ్యం’ పార్టీ తెల్లటి జెండాలో తెల్లరంగులో మూడు చేతులు, ఎర్రరంగులో ఉన్న మూడు చేతులు ఒకదానినొకటి పట్టుకొని ఉండగా మధ్యలో నలుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో తెల్లటి నక్షత్రం బొమ్మ ఉంది. ఆ చిహ్నాల అంతర్యం ఏమిటో కు కమల్ హాసన్ వివరించారు. వాటిలో ఆరు చేతులు దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులకు సంకేతమని, మధ్యలో నక్షత్రం ప్రజలకు సంకేతమని చెప్పారు.

కమల్ హాసన్ చెప్పిన ఈ సమాధానం విన్నవారికి మరో అనుమానం కలుగకమానదు. తమిళనాడులో పార్టీని స్థాపిస్తున్నప్పుడు మద్యలో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తావన ఎందుకు? అని. ఈ ప్రశ్నకు కమల్ సమాధానం చెప్పలేదు కానీ దక్షిణాది రాష్ట్రాలు ద్రవిడ రాష్ట్రాలు కనుక అన్నిటినీ కలుపుకొన్నారని సర్ది చెప్పుకోవాలి. అయితే దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క తమిళనాడులోనే  ద్రవిడ సంస్కృతి ప్రస్తావన పదేపదే వినిపిస్తుంది కానీ మిగిలిన రాష్ట్రాలలో ఆ ఊసే వినపడదు. మరి అటువంటప్పుడు జెండాలో ఇరుగుపొరుగు రాష్ట్రాలకు సంకేతం అని చెప్పుకోవడం అనవసరం. అంతకంటే, అందరూ ఊహిస్తున్నట్లు ఎర్ర చేతులు వామపక్ష భావజాలానికి, తెల్ల చేతులు మిగిలిన అన్ని వర్గాల ప్రజలకు సంకేతం అని చెప్పుకొని ఉంటే అర్ధవంతంగా ఉండేది. అయితే తాను లెఫ్టూ కాదు రైటు కాదు..సెంటరు అని కమల్ చెప్పుకొని ఆ అవకాశం లేకుండా చేసుకొన్నారు. ఏమైనప్పటికీ, కమల్ హాసన్ మరికొంతకాలం రాజకీయాలలో రాటు తేలిన తరువాత గాడిన పడవచ్చు.


Related Post