జైపాల్, నాగం ఇద్దరూ కోవర్టులే: దామోదర్ రెడ్డి

February 22, 2018


img

భాజపా నేత నాగం జనార్ధన్ రెడ్డి నేడోరేపో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దమవుతుంటే, డికె అరుణ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బాంబు పేల్చారు. అయన మీడియాతో మాట్లాడుతూ, “నాగం జనార్ధన్ రెడ్డి క్యాడర్ లేని నాయకుడు. మా పార్టీలో జైపాల్ రెడ్డికి ఆయనకు మద్య అండర్ స్టాండింగ్ ఉంది. అందుకే నాగంను పార్టీలోకి రప్పించాలని జైపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. వారిద్దరూ కలిసి పార్టీలో గ్రూపులు కడతారు గత ఎన్నికలలో నాగం, అయన కొడుకు ఇద్దరూ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొంటే గెలుస్తారనుకోవడం భ్రమ. అయనకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం కనుక పార్టీకే నష్టం. నిజానికి జైపాల్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ఇద్దరూ కోవర్టులని నా అభిప్రాయం. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే డికె అరుణవల్లేనని చెప్పాలి. మేమందరం గత 20 ఏళ్లుగా నాగంతో పోరాడుతున్నాము. ఇప్పుడు అతనిని తెచ్చి మా నెత్తిన పెదతామంటే మోయడానికి సిద్దంగా లేము. నేను, డికె అరుణ మరికొందరు జిల్లా నేతలు కలిసి డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి నాగంను పార్టీలోకి తీసుకోవద్దని గట్టిగా చెప్పివచ్చాము. అతనిని పార్టీలోకి తీసుకొంటే ఏవిధంగా నష్టపోతామో వివరించాము కూడా. కనుక నాగంను పార్టీలో చేర్చుకోరనే భావిస్తున్నాము. ఒకవేళ చేర్చుకొంటే మేము సహకరించము,” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 

దామోదర్ రెడ్డి చెప్పింది డికె అరుణ అభిప్రాయమేనని వేరే చెప్పనవసరం లేదు. కనుక నాగం జనార్ధన్ రెడ్డి కోసం బలమైన ఆమె వర్గాన్ని దూరం చేసుకోకపోవచ్చు. ఒకవేళ చేర్చుకొంటే, ఆయనకు సహకరించమని స్పష్టం చేశారు కనుక వచ్చే ఎన్నికలలో వారే అయనను ఓడించే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యం లేదు. ఇక నాగంకు మద్దతుగా జైపాల్ రెడ్డి ముందుకు వస్తే దామోదర్ రెడ్డి చెప్పినట్లుగా ముఠా తగాదాలు తలెత్తి పార్టీ నష్టపోవడం ఖాయమే. అలాగని నాగం భాజపాలోను ఇక కొనసాగలేరు. ఎందుకంటే తను త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పేసి వేరే పార్టీలో చేరబోతున్నానని ప్రకటించేశారు. కనుక భాజపాలోను గౌరవం కోల్పోయారు. చివరి నిమిషంలో డికె అరుణ వర్గం నుంచి వస్తున్న ఈ వ్యతిరేకత కారణంగా నాగం పరిస్థితి అయోమయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరి అయన ఏమి చేస్తారో.. కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తుందో? జైపాల్ రెడ్డి ఏమి చేస్తారో? డికె అరుణ వర్గం ఏమి చేస్తుందో చూడాలి. 


Related Post