ఖమ్మంలో అదే సీన్ మళ్ళీ రిపీట్

February 22, 2018


img

గత ఏడాది ఏప్రిల్ 28న ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ లో మిర్చి ధర పడిపోవడంతో కొందరు మిర్చి రైతులు ఆగ్రహంతో మార్కెట్ యార్డ్ కార్యాలయంపై దాడి చేయడం, పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం, వారి చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం, ఈ ఘటనలపై అధికార తెరాస, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు  తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం వంటివన్నీ బహుశః అందరికీ గుర్తుండే ఉంటాయి. మళ్ళీ ఈ ఏడాది కూడా  అటువంటి పరిస్థితులే నెలకొని ఉండటం చాలా విచారకరం. 

ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ లో ఈరోజు మిర్చి ధర పూర్తిగా పడిపోవడంతో మిర్చి రైతులు మార్కెట్ యార్డ్ గేటు వద్ద ఆందోళన చేస్తున్నారు. గత ఏడాది చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది అయినా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టకలేకపోయిందో దానికే తెలియాలి. అయితే గత ఏడాది చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మార్కెట్ యార్డ్ వద్ద బారీగా పోలీసులు మొహరించారు. ప్రస్తుతం ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మార్కెట్ అధికారులు, పోలీస్ అధికారులు మిర్చి రైతులకు నచ్చజెప్పి శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మిర్చి రైతులు తమ పెట్టుబడికి రెట్టింపు లాభాలు కావాలని అడగడం లేదు. కేవలం గిట్టుబాటు ధర ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నారు. దేశంలో అన్ని రకాల ఉత్పత్తులను తయారుచేసేవారు, వివిధ రకాల సేవలను అందించే వారు తమ ఉత్పత్తులకు, సేవలకు తామే స్వయంగా ధరలు నిర్ణయించుకొంటారు. కానీ కేవలం రైతులు మాత్రమే తమ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు. డిల్లీ, ముంబయి లేదా హైదరాబాద్ ఏసీ రూములలో కూర్చొన్న బడావ్యాపారులు, దళారులు ఎవరో వాటి ధరలు నిర్ణయిస్తే, రైతులకు ఎంత నష్టమోచ్చినా ఆ ధరకే అమ్ముకోవాలి. లేకుంటే టమోటో రైతులలాగ బయట పారబోసుకోవాలి లేదా మండబెట్టుకోవాలి. మరి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొంటున్నట్లు? చర్యలు తీసుకొంటే మళ్ళీ ఈ ఏడాది కూడా మిర్చి ధరలు ఎందుకు పడిపోయాయి? ఇప్పుడు ఆ మిర్చి రైతులు ఎవరికి మోరపెట్టుకోవాలి? 


Related Post