తెలంగాణా జనసమితి ఆవిర్భావ సభ వాయిదా?

February 21, 2018


img

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన ఏర్పాటు కాబోతున్న తెలంగాణా జనసమితి (టిజెఎస్) ఆవిర్భావ సభను మార్చి 10న హైదరాబాద్ లేదా వరంగల్ నగరాలలో నిర్వహించాలని అనుకొన్నప్పటికీ, అది మార్చి నెలాఖరుకు వాయిదాపడవచ్చని తెలుస్తోంది. ఒక దగ్గర బంధువు వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రొఫెసర్ కోదండరాం మొన్న సోమవారం రాత్రి అమెరికా బయలుదేరివెళ్ళారు. మళ్ళీ ఈనెల 27న హైదరాబాద్ తిరిగి వస్తారు. ఆవిర్భావసభకు ఏర్పాట్లు చేసుకోవడానికి అప్పటికి ఎంతో సమయం ఉండదు గనుక సభను మార్చి నెలాఖరున పెట్టుకోవాలని టిజెఎసి నేతలు భావిస్తున్నారు. మార్చి నెలాఖరున పార్టీని స్థాపించి ఏప్రిల్ నుంచి పాదయాత్రలు మొదలుపెట్టి ప్రజలలోకి వెళ్ళి తెరాస సర్కార్ నిరంకుశ విధానాలను ఎండగడుతూ ప్రజలను తమ పార్టీ వైపు ఆకర్షించుకోవాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టిజెఎసిలో ప్రజలకు బాగా పరిచయమున్నవారిలో ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే ప్రముఖంగా కనిపిస్తారు. అదే కాంగ్రెస్, తెరాస, తెదేపా, భాజపా, వామపక్షాలలో చాలామంది నాయకులు ప్రజలకు చిరపరిచితులే. కనుక తెలంగాణా జనసమితి స్థాపన ఒక ఎత్తైతే, పార్టీని, దానిలో నేతలను ప్రజల గుర్తింపు పొందేలా చేయడం మరొక ఎత్తు. ఈ రెంటి తరువాత కాంగ్రెస్, తెరాస, భాజపా, తెదేపా, మజ్లీస్ పార్టీలను, సిపిఎం నేతృత్వంలో ఏర్పాటయిన బి.ఎల్.ఎఫ్. ను ఎదుర్కొని నిలబడగలిగే అభ్యర్ధులను సిద్దం చేసుకోవడం ఇంకా క్లిష్టమైన పని. అన్నిటికంటే క్లిష్టమైన పని తమ పార్టీకే ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పుకొని వారిని  ఒప్పించడం. కనుక తెలంగాణా జనసమితికి ముందున్నది కరుకుముళ్ళున్న బాటేనని చెప్పక తప్పదు.


Related Post