ఏపి ప్రజలకు మళ్ళీ కుచ్చు టోపీలు సిద్దం?

February 21, 2018


img

ఏపిలో చాలా విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయిప్పుడు. అధికార తెదేపా, దాని ప్రభుత్వంలో భాగస్వామి భాజపా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా మూడు కూడా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని వాటిని ఎదుటపార్టీ ఖాతాలో వేయాలని తిప్పలు పడుతున్నాయి. 

ఇదివరకు రాష్ట్ర విభజన సమయంలో వైకాపా, తెదేపాలు ఏవిధంగా ఏపి ప్రజలను మభ్యపెట్టాయో మళ్ళీ ఇప్పుడూ ఎంపిల రాజీనామాలు, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం వంటి జిమ్మిక్కులతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం తాము మాత్రమే తపించిపోతున్నామని చాటుకొని, ప్రజలను ప్రసన్నం చేసుకొని రాబోయే ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికే అవి ఈ కపట నాటకాలు ఆడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు. కనుక మార్చి 21వ తేదీన మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆ పార్టీ ఎంపి వైవి సుబ్బారెడ్డి 184వ నిబంధన క్రింద లోక్ సభ స్పీకర్ కు నోటీసు కూడా అందజేశారు. 

లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 55 మంది ఎంపిలు ఉండాలి. కానీ వైకాపాకు కేవలం ఐదుగురు ఎంపిలు, ఒక రాజ్యసభ సభ్యుడు మాత్రమే ఉన్నారు. ఒకవేళ 55 మంది ఉన్నా మోడీ సర్కార్ కు వారి తీర్మానంతో ‘ఫరక్’ పడదని అందరికీ తెలుసు. అయినా వైకాపా ఎందుకు సిద్దపడింది? అని ఆలోచిస్తే దీని నుంచి రాజకీయ మైలేజి పొందడానికేనని అర్ధం అవుతోంది. 

తెదేపా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామిగా ఉన్నందున అది ఈ తీర్మానానికి మద్దతు ఈయలేదు. ఇస్తే భాజపాతో తెగతెంపులవుతాయి. ఇవ్వకపోతే ‘తెదేపాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అని తేలిపోయింది’ అని వైకాపా టాంటాం చేస్తుంది. 

వైకాపా వ్యూహాలను ఎదుర్కోవడానికి భాజపాను ప్రజల ముందు ‘బకరా’ గా నిలబెట్టాలని తెదేపా యోచిస్తోంది. కేంద్రం సహకరించనందునే అమరావతి, పోలవరం ప్రాజెక్టు, మెట్రో రైల్ ప్రాజెక్టు వగైరాలు పూర్తి చేయలేకపోయామని చెప్పి తప్పించుకోవాలని చూస్తోంది. 

ఏపిలో భాజపాకు కొత్తగా వచ్చే నష్టమేమీ ఉండదు కనుక అది కూడా తెదేపాకు గట్టిగానే బదులిస్తోంది. తమతో పొత్తులు పెట్టుకొనేందుకు వేరే పార్టీ (వైకాపా) సిద్దంగా ఉందని సంకేతాలు ఇస్తోంది. ఈవిధంగా మూడు ప్రధాన పార్టీలు కలిసి ఏపి ప్రజల నెత్తిన కుచ్చు టోపీలు పెట్టాలని చూస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Related Post