నేడే కమల వికాసం!

February 21, 2018


img

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇవ్వాళ్ళే తన పార్టీ పేరు, జెండా, అజెండా అన్నీ ప్రకటించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు మదురైలో బహిరంగ సభ నిర్వహించి పార్టీ వివరాలను కమల్ హాసన్ ప్రజలకు తెలియజేస్తారు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అంతకు ముందు కమల్ హాసన్ తన సహా నటుడు రజనీకాంత్ ఇంటికి, తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె అధినేత కరుణానిధి ఇంటికి వెళ్ళి చర్చలు జరుపడం చాలా ఆసక్తి రేపుతోంది. రజనీకాంత్ కూడా రాజకీయాలలో రావాలనుకొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక అయనను కూడా కలుపుకుపోవాలనే ఆలోచనతోనే కలిసి ఉండవచ్చు. అయితే కమల్ హాసన్ ఈరోజు తన పార్టీని ప్రకటించడానికి సిద్దం అవుతున్నందున రజనీకాంత్ సానుకూలంగా స్పందించలేదని భావించవచ్చు. 

మరో విశేషమేమిటంటే, పార్టీని ప్రకటించే ముందు కమల్ హాసన్ డిఎంకె అధినేత కరుణానిధిని కలవడంతో ఆ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆలోచన ఉన్నట్లు సంకేతాలు పంపారు. కానీ ఆ పార్టీ నుంచి కూడా సానుకూల స్పందన రాలేదు. “కమల్ హాసన్ స్థాపించబోయే పార్టీ ఒక కాగితపు పువ్వు వంటిది. అది కొన్నాళ్ళు మాత్రమే వికసించి నేలరాలిపోతుంది. రాబోయే ఎన్నికల తరువాత అది కనిపించకపోవచ్చు” అని కరుణానిధి వారసుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక తమిళనాడు రాజకీయాలలో కమల్ హాసన్ ఒంటరి ప్రయాణం చేయక తప్పదని స్పష్టం అవుతోంది. తమిళనాడు ప్రజలను తన పార్టీ వైపు ఆకర్షించేందుకు నేటి నుంచి అయన రాష్ట్రంలో పాదయాత్ర చేయబోతున్నారు.



Related Post