దానితోనే రైతుల కష్టాలన్నీ తీరిపోతాయా?

February 20, 2018


img


రాష్ట్రంలో చిన్నచిన్న పార్టీలన్నీ కలిసి సిపిఎం నేతృత్వంలో ఏర్పాటు చేసుకొన్న బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) మొట్టమొదటి బహిరంగ సభ మంగళవారం సంగారెడ్డిలో జరుగుతోంది. ఈ సందర్భంగా దాని కన్వీనర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అడిగిన ఒక ప్రశ్న చాలా ఆలోచింపజేసేదిగా ఉంది. “రాష్ట్రంలో రైతులందరికీ ఎకరాకు రూ.4,000 చొప్పున పంట పెట్టుబడి ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన మంచిదే కానీ దానితోనే రైతుల సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయన్నట్లు తెరాస మంత్రులు మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది,” అన్నారు. 

పంటలు వేసే సమయంలో రైతులకు ప్రతీ పైసా చాలా విలువైనదే. అందుకే ఈ పధకాన్ని అమలుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. అయితే పంట వేసినప్పటి నుంచి అది చేతికి వచ్చి మార్కెట్లో అమ్ముకొనేవరకు ప్రతీ దశలో రైతన్నలు రకరకాల కష్టాలు ఎదుర్కోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. 

ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆర్మూరు పట్టణంలో బంద్ నిర్వహించి నిరసన తెలపడం అందరూ చూశారు. అలాగే కందులు, టమేటా రైతులు కూడా తమ పంటను నష్టానికి అమ్ము కోవలసి వచ్చింది. మిర్చి, పత్తి రైతుల దీనగాధాలు అందరికీ తెలిసినవే. రైతులందరూ ప్రతీ ఏటా ఈ సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. వారిలో ఆర్ధిక సమస్యలను భరించలేని వారు ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. 

కనుక రైతులకు పంట పెట్టుబడి అందించడంతోనే వారి సమస్యలన్నీ తీరవని స్పష్టం అవుతోంది. వారికి పంట పెట్టుబడి అందించడం మొదలు, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం, సాగునీటి సౌకర్యం కల్పించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయడం, రాని పక్షంలో వచ్చే వరకు రైతులు తమ పంటలను నిలువ చేసుకోవడానికి అవసరమైన గోదాములను నిర్మించడం, బ్యాంకుల నుండి సులభంగా రుణాలు అందేలా చేయడం వంటివన్నీ చేసినప్పుడే ఆశించిన ఫలితాలు కనబడతాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిలో కొన్నిటిని పూర్తి చేసింది మరికొన్ని వివిధ దశలలో ఉన్నాయి. కనుక రైతులకు అన్నీ సమకూరేవరకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 


Related Post