అందుకే కెసిఆర్ కులాల బాట పట్టారు

February 20, 2018


img

భాజపా ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి తెరాస సర్కార్ పై నిశితంగా విమర్శలు గుప్పించారు. అయన మంగళవారం మహబూబ్ నగర్ లో పర్యటించినప్పుడు విలేఖరులతో మాట్లాడుతూ “తెరాస తన నీడను చూసి తనే భయపడుతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ 100-106 సీట్లు మాకేనని ఎన్ని గిప్పలు చెప్పుకొన్నా పార్టీలో నేతలకు మాత్రం ఆ నమ్మకం లేదు. తెరాసలో చాలా మందికి ఓటమి భయం పుట్టుకొందని వారి మాటలు, చేతలే స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతృప్తిగా లేరనే సంగతి ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా బాగా గ్రహించారు. అందుకే ప్రజలకు కులాలవారిగా తాత్కాలిక ప్రయోజనాలు కల్పిస్తూ అందరినీ మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికలలో తెరాస ఓటమి ఖాయం. తెరాస అధికారం వచ్చి దాదాపు నాలుగేళ్ళు పూర్తి కావస్తోంది. ఇంతకాలంగా రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా అద్యాపకులను నియమించలేదు. ఏమంటే నిధుల కొరత అంటారు. తెరాస మంత్రులు చెప్పుకొంటున్న అభివృద్ధి మాటలలోనే కనిపిస్తుంది తప్ప చేతలలో కనబడదు,” అని విమర్శించారు.

ఇదివరకు ఎన్నికల సంవత్సరంలో మాత్రమే అన్ని పార్టీలు ఎన్నికల గురించి మాట్లాడేవి. కానీ ఇప్పుడు అధికారం చేపట్టిన మొదటి ఏడాది నుంచే ఎన్నికల మాటలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అధికార పార్టీలు మూడు నాలుగేళ్ల వరకు ఎన్నికల ప్రస్తావన చేయవు. కానీ తెరాస సర్కార్ మాత్రం మొదటి నుంచి ఎన్నికల జపం చేస్తూనే ఉంది. రాబోయే ఎన్నికలలో తమకు ఎదురు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఫిరాయింపులను ప్రోత్సహించడం, ప్రతీ ఎన్నికను జీవన్మరణ సమస్య అన్నంత తీవ్రంగా పరిగణించి ఎదుర్కోవడం, పదేపదే సర్వేలు చేయించుకోవడం, రాజకీయ సన్యాసం సవాళ్ళు చేయడం వంటివన్నీ అభాద్రతాభావానికి సూచించేవేనని చెప్పక తప్పదు. కనుక ముఖ్యమంత్రి కెసిఆర్ చేయించిన సర్వేలు ఎంతవరకు సరైనవో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. 


Related Post