అది నిజమైన ప్రజాహిత వాజ్యం

February 20, 2018


img

వినీత్ దండా అనే వ్యక్తి సుప్రీం కోర్టులో మంగళవారం ఒక ప్రజాహిత వాజ్యం దాఖలు చేశారు. దానిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను ముంచి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీని వెనక్కు రప్పించేందుకు, అయన బ్యాంకులకు చెల్లించవలసిన బాకీలను వడ్డీతో సహా చెల్లింపజేయాలని కోరారు. ఈవిధంగా బ్యాంకుల నుంచి వందలు, వేలకోట్లు తీసుకొన్నవారు దర్జాగా విదేశాలకు పారిపోతుంటే, తమను నిండా ముంచుతున్న నీరవ్ మోడీ వంటి ఆర్ధికనేరగాళ్ళను ఏమి చేయలేకపోతున్న బ్యాంకులు వ్యవసాయం కోసం లక్ష, రెండు లక్షలు తీసుకొన్నవారు నిరుపేద రైతులపై తమ ప్రతాపం చూపుతున్నాయని ఆ కారణంగా వారు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.

నీరవ్ మోడీ వంటి ఆర్ధికనేరగాళ్ళు చేస్తున్న మోసాల వలన బ్యాంకింగ్ వ్యవస్థకు కలుగుతున్న నష్టాలను చివరికి సామాన్య ప్రజల మీదే పడుతోందని కనుక ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని కేంద్రప్రభుత్వానికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ తప్పు కనిపిస్తోందని కనుక ఈ పిటిషన్ లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించి, ప్రతివాదులకు నోటీసులు పంపించింది. మళ్ళీ ఫిబ్రవరి 23న ఈ కేసుపై విచారణ జరపనున్నట్లు తెలిపింది. ఇంతవరకు చాలా ప్రజాహిత వాజ్యాలు దాఖలయ్యి ఉండవచ్చు. కానీ ఇదే అసలు సిసలైన వాజ్యం అని చెప్పవచ్చు. ఒకవేళ పిటిషనర్ కోరినట్లు సుప్రీం కోర్టు కలుగజేసుకొని కేంద్రాన్ని, రిజర్వ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో సహా అన్ని బ్యాంకులను గాడిన పెట్టగలిగితే, దేశానికి ఏటా కొన్ని వేలకోట్లు మిగులుతాయి. తద్వారా దేశ ఆర్ధికవ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. సామాన్యుడిపై భారం తగ్గుతుంది. కానీ రాజకీయ పలుకుబడితో దశాబ్దాలుగా సాగిపోతున్న ఈ అధికారిక దోపిడీని అడ్డుకట్ట వేయడం సుప్రీం కోర్టు తరమా?


Related Post