రైతుల ఆత్మహత్యలు నిజమైనవి కావు: నాయిని

February 20, 2018


img

రాజకీయ నాయకులకి లౌక్యం చాలా అవసరం. మనసులో ఎటువంటి ఆలోచనలున్నప్పటికీ, అవసరం లేనప్పుడు వాటిని బయటకు చెప్పకూడదు. అలాగే ఏ విషయం గురించైనా ప్రజలను మెప్పించే విధంగా మాట్లాడటం చాలా అవసరం. ఈ విషయంలో తెరాస నేతలతో సహా అన్ని పార్టీల నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్, కేటిఆర్, కవిత, హరీష్ రావుల నుంచి చాలా నేర్చుకోవలసి ఉంది. ముఖ్యంగా మనసులో మెదిలే ఆలోచనలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అలవాటున్న తెలంగాణా రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నర్సింసింహారెడ్డి వంటి భోళా నేతలు నేర్చుకోవాలి. 

నిన్న సంగారెడ్డిలో హెరిటేజ్ జైలు మ్యూజియంలో ఆయుర్వేదిక్ విలేజ్ ను ప్రారంభోత్సవం చేస్తూ, “రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలన్నీ నిజమైనవి కావు. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బారీగా నష్టపరిహారం చెల్లిస్తోంది గనుక దినసరి కూలీలు, వివిధ పనులు చేసుకొనేవారు ఏవో కారణాల చేత ఆత్మహత్యలు చేసుకొన్నప్పుడు వారిని రైతులుగా పేర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వం అందించే ఆర్ధికసహాయం పొందవచ్చని ఆశ పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడిగా ఎకరానికి రూ.4,000 అందించబోతోంది,” అని అన్నారు.

రైతుల ఆత్మహత్యల విషయంలో మంత్రి నాయిని చెప్పిన మాట వాస్తవమే కావచ్చు కానీ సున్నితమైన ఆ సమస్య గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నప్పుడు అయన ఈవిధంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఇటువంటివి చెప్పడానికి పార్టీలో తగిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు. వారి చేత మృదువుగా చెప్పిస్తే సరిపోయేది. కానీ హోం మంత్రి హోదాలో ఉన్న నాయిని చెప్పడం వలన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లయింది.


Related Post