వెనక ఒక్క ఎంపి కూడా లేడు కానీ...

February 19, 2018


img




ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగా ఇటు తెలంగాణాలో అటు ఏపిలోను ప్రధాన రాజకీయపార్టీలు మెల్లగా ‘రాజకీయ ఉష్ణోగ్రతలు’ పెంచుతున్నాయి. తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసల మద్య మాటల యుద్దాలు జరుగుతుంటే, ఏపిలో తెదేపా-వైకాపా-భాజపాల మద్యలో జనసేన దూరింది. విచిత్రమేమిటంటే, ఇంకా పార్టీ నిర్మాణం కూడా పూర్తి చేసుకోకుండా, వెనుక ఒక్క ఎంపిటిసి..కార్పొరేటర్ అయినా లేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్దమనిషి పాత్ర పోషిస్తూ ఏపికి జరిగిన అన్యాయంపై మేధావులతో సమావేశం నిర్వహించారు. 

“మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడతాము..మీరు మద్దతు ఇస్తారా?” అనే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సవాలుకు తెదేపా స్పందించి ఉంటే ఏమైనా అర్ధం ఉండేది. కానీ వెనుక అభిమానులే తప్ప ఒక్క ఎంపి కూడా లేని పవన్ కళ్యాణ్ ఆ సవాలును స్వీకరిస్తున్నానని చెప్పడం విడ్డూరంగా ఉంది. 

“ముందు మీరు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి..నేను డిల్లీ వచ్చి అన్ని పార్టీల మద్దతు కూడగడతానని” పవన్ కళ్యాణ్ చెప్పడం చాలా హస్యస్పదంగా ఉంది. తెదేపానే ఒప్పించగలరో లేదో చెప్పలేకపోతున్న అయన ఉత్తరాది పార్టీలను ఏవిధంగా ఒప్పించగలరు? 

నిజానికి ఏపిలో తెదేపా, వైకాపా, భాజపాలు మూడు ఒకదానినొకటి ఏదోవిధంగా ముగ్గులోకి దింపి రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి మద్యలో ఏమాత్రం రాజకీయ పరిపక్వతలేని పవన్ కళ్యాణ్ దూరుతున్నారు. ఒకవేళ మళ్ళీ తెదేపా, భాజపాలు కలిసిపోతే మద్యలో నలిగిపోయేది జనసేన పార్టీయేనని గ్రహించలేకపోతున్నారు. అప్పుడు అయన వాటిని సమర్ధించలేక...వైకాపాతో చేతులు కలపలేక..ఒంటరిగా పోరాటం చేయలేక అయోమయస్థితిని ఎదుర్కోవలసిరావచ్చు. కనుక పవన్ కళ్యాణ్ ఆ మూడు దేశముదురు రాజకీయపార్టీలకు దూరంగా ఉండటమే చాలా మంచిది. వాటి కంటే జయప్రకాశ్ నారాయణ్ వంటి మచ్చలేని నాయకులతో కలిసి ముందుకు సాగితే, ఎన్నికలలో ఒక్క సీటు గెలవకపోయినా కనీసం ప్రజలలో గౌరవమైనా మిగులుతుంది లేకుంటే చివరికి పొలిటికల్ బఫూన్ మాదిరిగా నవ్వులపాలయ్యే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే మంచిది.            



Related Post