నేను దేశం విడిచి పారిపోలేదు: విక్రం

February 19, 2018


img

దేశంలో బ్యాంకులను మోసం చేసినవారిలో విజయ్ మాల్యా మొదటివాడు కాదు…చివరివాడు కాడని వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ నిరూపించాడు. కాన్పూర్ కు చెందిన విక్రం కొఠారి అది నిజమేనని మరోసారి దృవీకరించాడు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్ నగరం కేంద్రంగా నడుస్తున్న రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అధినేత విక్రం కొఠారి. అతను అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ల నుంచి రూ.800 కోట్లు అప్పులు తీసుకొన్నారు. కానీ ఇంతవరకు వాటికి వడ్డీ కూడా చెల్లించకుండా తప్పించుకొంటున్నారు. కాన్పూర్ నగరంలో మాల్ రోడ్ లో గల రోటోమాక్  కార్యాలయం గత 10 రోజులుగా మూసివేయబడి ఉండటంతో ఆయన కూడా విదేశాలకు పారిపోయారని మీడియాలో వార్తలు వచ్చాయి. 

వాటిపై అయన స్పందిస్తూ, “నేను దేశం విడిచి ఎక్కడికీ పారిపోలేదు. కాన్పూర్ లోనే ఉన్నాను. నేను బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోన్నమాట వాస్తవమే...వాటిని తీర్చలేకపోయిన మాట కూడా వాస్తవమే. ఆ కారణంగా బ్యాంకులు నా అప్పులను ‘నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్’ (ఎన్.పి.ఏ.) గా ప్రకటించాయి తప్ప ‘డిఫాల్టర్’ గా ప్రకటించలేదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో దీనికి సంబందించి కేసులు నడుస్తున్నాయి. అవి పరిష్కారం కాగానే నేను బ్యాంకుల వద్ద తీసుకొన్న అప్పులను తీర్చేస్తాను. వీటి కోసం నేను దేశం విడిచి పారిపోయే ప్రసక్తే లేదు,” అని మీడియాకు చెప్పారు. 

ఇటువంటి ఆర్ధికనేరగాళ్ళు బ్యాంకుల నుంచి అప్పులు రూపంలో వందలు,వేల కోట్లు తీసుకొని ఎగవేస్తున్న కారణంగా, బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. వాటిని కాపాడేందుకు గత 11 ఏళ్ళలో కేంద్ర ఆర్ధికశాఖ రూ.2.6 లక్షల కోట్లు అందించింది. 2017-18 సం.లలో మోడీ సర్కార్ కూడా సుమారు 80,000 కోట్లు పైగా అందించబోతోంది. 

బ్యాంకింగ్ వ్యవస్థను తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థను చెదపురుగులాగ దొలిచేస్తున్న ఇటువంటి ఆర్దికనేరగాళ్ళను ఉక్కుపాదంతో అణచివేసి, వారి నుంచి తీసుకొన్న సొమ్మునంతా కక్కించే ప్రయత్నం చేయకుండా, బ్యాంకులు మళ్ళీ మళ్ళీ అదే తప్పులు చేయడానికి వీలుగా కేంద్రప్రభుత్వం ప్రజల కష్టార్జితాన్ని బ్యాంకుల దోసిట్లో పోస్తుండటం చాలా దారుణం. ఎవరైనా ఒకసారి రెండుసార్లు మోసపోయాకైనా అప్రమత్తం అవుతుంటారు. కానీ ఈ అధికారిక దోపిడీ ప్రక్రియ దశాబ్దాలుగా నిరంతరంగా సాగిపోతూనే ఉండటమే విస్మయం కలిగిస్తోంది. 

అవినీతిని అంతమొందిస్తామని గొప్పలు చెప్పుకొంటున్న జాతీయపార్టీలే ఈ ‘అన్ లిమిటెడ్ దోపిడీ’ కొనసాగేందుకు వీలుగా బ్యాంకులకు నిధులు అందిస్తుండటం బాధాకరం. రాజకీయ పలుకుబడి కలిగిన ఆర్ధికనేరగాళ్ళు చేస్తున్న ఈ అధికారిక దోపిడీకి అటు ప్రభుత్వాలు, ఇటు దేశప్రజలు కూడా మూల్యం చెల్లించుకోవలసివస్తోంది. అయినా ప్రభుత్వాలు మేల్కొనకపోవడం దేశ ప్రజల దౌర్భాగ్యమే.


Related Post