రేవంత్ రెడ్డి పిటిషన్..తెరాస సర్కార్ కు తలనొప్పి

February 15, 2018


img

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో వేసిన ఒక అనుబంద పిటిషన్ తో తెరాస సర్కార్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. పిడమర్తి రవి, ఇ.బాలకిషన్, కొప్పుల ఈశ్వర్‌, కె.వి.రమణాచారి, పేర్వారం రాములు, ఎస్‌.వేణుగోపాలాచారి, ప్రశాంత్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జి.వివేకానంద, ఆర్‌.విద్యాసాగర్‌రావు, దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎ.కె.గోయల్, వి రామచంద్రు తెజావత్, ఆర్‌.రామలక్ష్మణ్, సోమారపు సత్యనారాయణ, బి.వి.పాపారావు తదితరులకు క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. 

రాజ్యాంగంలోని అధికరణ 164 (1ఎ) ప్రకారం ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో 15 శాతానికి మించి మంత్రులు ఉండకూడదు. కానీ తెరాసలో రాజకీయ నిరుద్యోగుల కోసం తెరాస సర్కార్ క్యాబినెట్ హోదా కలిగిన ప్రత్యేక పదవులు సృష్టించి నియామకాలు చేసిందని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో ఆరోపించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని కనుక వారందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో కోరారు. 

జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మార్చి 14వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషన్ లో పేర్కొన్నవారందరికీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కలిసి నోటీసులు అందించడానికి హైకోర్టు అనుమతించడం విశేషం. 

డిల్లీ ఆమాద్మీ సర్కార్ లో 20 మంది ఎమ్మెల్యేలను సంతృప్తిపరచడానికి ఇదేవిధంగా పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి క్యాబినెట్ హోదా కల్పించింది. ఈ విషయాన్నీ హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్ళగా వారందరిపై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల సంఘానికి సూచించింది. అది వారిపై అనర్హత వేటు వేసింది. రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేశారు. 

ఆ తీర్పు ఆధారంగా తెరాస సర్కార్ లో క్యాబినెట్ హోదా అనుభవిస్తున్నవారిపై కూడా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అనుబంద పిటిషన్ లో కోరారు. డిల్లీలో జరిగిన ఆ కేసు ఇక్కడ తెలంగాణా సర్కార్ పీకకు చుట్టుకోవడం ఆశ్చర్యకరమే. తెరాస సర్కార్ దీని నుంచి ఏవిధంగా బయటపడుతుందో చూడాలి. 


Related Post