తెరాస-కాంగ్రెస్-భాజపా ట్రయాంగిల్ ఫైట్స్

February 14, 2018


img

కేంద్రబడ్జెట్ పై రాష్ట్రంలో తెరాస-కాంగ్రెస్-భాజపాల మద్య జరుగుతున్న మాటల యుద్ధాలు ప్రజలకు మంచి వినోదం పంచుతున్నాయి. కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని, రెండు తెలుగు రాష్ట్రాలను మోసం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ వాదించారు. మోడీ సర్కార్ రాష్ట్రానికి అన్యాయం చేసినా తెరాస సర్కార్ నోరుమెదపడం లేదని కాంగ్రెస్ విమర్శిస్తుంది. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాపీగా మొసలి కన్నీళ్లు కారుస్తోందని తెరాస ఎద్దేవా చేస్తుంటుంది. తెలంగాణా పట్ల మోడీ సర్కార్ ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే చూపిందని, బడ్జెట్ లో అదే మరోసారి చూపిందని తెరాస విమర్శిస్తుంది. రాష్ట్రంలో రైతులను నిండా ముంచుతున్న తెరాస సర్కార్ కేంద్రాన్ని విమర్శించడం సిగ్గుచేటని భాజపా విమర్శిస్తుంది. 

ఈవిధంగా మూడు ప్రధానపార్టీలు ఒకదానినొకటి నిందించుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నాయి. వాటి వాదనలు బడ్జెట్ చుట్టూనే తిరుగుతున్నప్పటికీ, అవి రాష్ట్రానికి న్యాయం లేదా అన్యాయం జరిగిందని కాక, ఆ వంకతో ఒకదానినొకటి రాజకీయంగా దెబ్బతీసి పైచెయ్యి సాధించాలన్న తపనే వాటిలో ఎక్కువగా కనబడుతోంది. 

రాష్ట్ర భాజపా నేతలు సహజంగానే కేంద్ర బడ్జెట్ ను సమర్ధించుకొంటూ మాట్లాడుతున్నారు. కానీ వాస్తవాలు ఏమిటో వారికీ తెలుసు..ప్రజలకూ తెలుసు. కానీ తెరాస, కాంగ్రెస్ పార్టీల దాడిని గట్టిగా తిప్పి కొట్టకపోతే, అవి తమను ప్రజల దృష్టిలో దోషులుగా నిలబెడతాయనే భయం ఉంది. అందుకే రాష్ట్ర భాజపా నేతలు కాంగ్రెస్, తెరాసలపై ఎదురుదాడి చేస్తున్నారు.  

రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా తెరాస తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మౌనం వహిస్తోందని గట్టిగా చెప్పడం ద్వారా, తెరాస కంటే తామే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కువ ఆలోచిస్తున్నామని ప్రజలకు చెప్పుకోవడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. 

కాంగ్రెస్, భాజపాలు ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్నప్పుడు తెరాస మౌనంగా ఊరుకొంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. అందుకే అదీ వాటిపై ఎదురుదాడి చేస్తోంది.

కనుక బడ్జెట్ కేటాయింపులనేది వాటి వాదనలకు ‘బేస్’ మాత్రమే తప్ప దాని కోసమే అవి పోరాడుకోవడం లేదని స్పష్టం అవుతోంది. ఇంతకీ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎవరు సవరించాలి? భాజపా, తెరాస, కాంగ్రెస్? 


Related Post