దానికీ పిర్యాదేనా?

February 14, 2018


img

రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బుధవారం హైదరాబాద్ సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతికి ఒక విచిత్రమైన పిర్యాదు చేశారు. తను పార్టీ మారబోతున్నానని కొందరు సోషల్  మీడియాలో పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని వారిని కనుగొని చట్టప్రకారం శిక్షించాలని తన పిర్యాదులో కోరారు. అధికార తెరాసయే తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు వారిని ప్రోత్సహిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

రాజకీయాలలో ఇటువంటి దుష్ప్రచారాలు, మైండ్ గేమ్స్ చాలా మామూలు విషయమే. అదేవిధంగా ఈరోజుల్లో పార్టీ ఫిరాయింపులు గొప్ప ఘనకార్యంగా భావించబడుతున్నాయి కనుక దాదాపు అన్ని పార్టీల నేతలు ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి ఫిరాయింపులు జరుగబోతున్నాయని గొప్పగా చెప్పుకొంటున్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా కొందరు తెరాస నేతలు, ఒకరిద్దరు మంత్రులు తమతో టచ్చులో ఉన్నారని సరైన సమయంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని బహిరంగంగానే చెపుతున్నారు. 

ఇక సోషల్ మీడియా కూడా ఇటువంటి ఊహాగానాలకు అతీతం కాదు. వ్యక్తిగతంగా ఎవరికీ ఇబ్బంది, హాని కలిగించనంత వరకు ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు. అన్ని పార్టీల నేతలు ఈ మైండ్ గేమ్స్ ఆడుకొంటున్నప్పుడు మళ్ళీ మద్యలో పోలీసులను కూడా వాటిలోకి లాగి ఇబ్బంది పెట్టడం ఎందుకు? దాసోజు శ్రవణ్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోనే ఉండదలిస్తే, ఆ విషయం ప్రజలకు, తన రాజకీయ ప్రత్యర్ధులకు తెలియజెప్పేందుకు అనేక మార్గాలున్నాయి. వాటిని వాడుకొంటే సరిపోతుంది కదా?


Related Post